మరో ఆరు మార్కెట్ కమిటీలు
ఇప్పటివరకు 51 కమిటీలకు నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (పాశం విజయ), ఆలేరు (కాలే సుమలత), కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట (గుండ సరోజన), మానకొండూరు (మల్లగల్ల నగేశ్) కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేశారు. రంగారెడ్డి జిల్లా సర్దార్నగర్ కమిటీ చైర్మన్గా శేరిగూడెం వెంకటయ్య, మెదక్ జిల్లా నంగునూరు కమిటీ చైర్మన్గా సంగు పురేందర్ నియమితులయ్యారు. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 11 కమిటీలకు పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించారు.
మిగిలిన 168 కమిటీలకుగాను 51 కమిటీలకు పాలక మండళ్లను నియమించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 21 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు ఒక్క కమిటీని కూడా నియమించలేదు. మార్కెట్ కమిటీల్లో చోటు కల్పించాలంటూ టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీల కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రతిపాదనలపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు తమకు అనుకూలంగా ఉండే వారిని రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా ప్రతిపాదిస్తున్నారు.పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ఏడాదిగా నిర్ణయించడంతో తర్వాతి పాలక మండలిలో చోటు కల్పిస్తామంటూ సర్దిచెప్తున్నారు.
నెలాఖరులోగా భర్తీ: మంత్రి హరీశ్
వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలుపుతున్నాం. మిగతా కమిటీలకు సంబంధించి నియామక ప్రక్రియపై కసరత్తు సాగుతోంది. నెలాఖరులోగా కమిటీలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఉన్నాం. సమర్థులను ఎంపిక చేయడం ద్వారా మార్కెట్ యార్డుల కార్యకలాపాలను రైతులకు మరింత చేరువ చేస్తాం. దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకూ పెద్దపీట వేస్తున్నాం.