అసెంబ్లీని ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసింది
విజయనగరం ఫోర్ట్: అధికార పార్టీ అసెంబ్లీని ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక కోట జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహారిస్తుందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చినా మాట్లాడడానికి చంద్రబాబు ఆశక్తి చూపేవారు కాదని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవడానికే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య, చిన్న శ్రీను, రొంగలి పోతన్న, యడ్ల ఆదిరాజు, డోల మన్మధకుమార్, తదితరులు పాల్గొన్నారు.