వందేళ్ళ సూపర్ బామ్మ...!
గౌహతిః వందేళ్ళ వయసులోనూ ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వయంగా వృద్ధాశ్రమాన్ని స్థాపించి.. వయో వృద్ధులకు ఆసరాగాగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం గౌహతి సివిక్ అడ్మనిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతి కావాలంటూ ధరఖాస్తు చేసింది.
అస్సాంకు చెందిన అరుణా ముఖర్జీ వయసు ఆగస్టు 31 నాటికి వందేళ్ళకు చేరింది. అయితేనేం.. ఆమె వృద్ధులకు సేవలందించేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఆశ్రమ నిర్వహణకు పర్మిషన్ కోరుతూ స్థానిక పౌర పరిపాలనా విభాగానికి ధరఖాస్తు చేసింది. దీంతో అక్కడి అధికారులు విస్తుపోయారు. వృద్ధాశ్రమాన్ని ఎవరు నిర్వహిస్తారంటూ మేయర్ అరుణను ఆరా తీశారు. వారి ప్రశ్నలకు ఏమాత్రం జంకని అరుణ.. ఎంతో ఉత్సాహంగా తానేనంటూ సమాధానం ఇచ్చింది. ఆమె ఆత్మవిశ్వాసానికి మురిసిపోయిన మేయర్ మ్రిగేన్ సరానియా సహా.. సిబ్బంది పర్మిషన్ కోసం కావలసిన పనులను వెంటనే చేసి పంపించారు. దీంతో ఆక్టోబర్ నాటికి అరుణ స్వయంగా ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పెయింటింగ్, మ్యూజిక్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, సాఫ్ట్ టాయ్స్ తయారీ వంటి కళల్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చే నాలుగు సంస్థలు అరుణ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. దీంతో అరుణ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలు. కాస్త కంటిచూపు, వినికిడి శక్తి తగ్గడం తప్పించి మిగిలిన అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నఆ ఉత్సాహవంతురాలు.. ఇంటిపనులను సైతం స్వయంగా చేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె.. కేవలం టీ బిస్కట్లు, సీజన్ లో అయితే కమలా ఫలాలు వంటి ఆహారంతోనే గత 70 ఏళ్ళుగా కాలం గడుపుతోంది. ఆ అలవాటును 1947 లో బంగ్లాదేశ్ యద్ధసమయంలో శరణార్థిగా ఉన్నపుడు ఆకలిని ఎదిరించేందుకు అలవరచుకుంది. బంగ్లాదేశ్ ఢాకాలో జన్మించిన అరుణ.. అస్పాంలోని గౌహతి కాటన్ కాలేజీలో పనిచేస్తున్న జాదూలాల్ ముఖర్జీతో వివాహం అనంతరం ఎనభై ఏళ్ళ క్రితమే అస్సాంలో స్థిరపడింది. భర్త మరణించి, సంతానం కెనడాలో స్థరపడటంతో అరుణ చాలాకాలంనుంచీ స్వతంత్రంగానే జీవిస్తోంది. వందేళ్ళ వయసులోనూ వరదల సమయంలో ఆయాప్రాంతాల్లో పర్యటించి, ఆపన్నులకు సేవలు అందిస్తున్న అరుణ జీవిత కథను.. ఓ ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిత్రంగా కూడా మలిచేందుకు ప్రయత్నిస్తోంది.