మహిళ ప్రయాణికురాలిపై దాడి
ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలోని గోరేగావ్ స్టేషన్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ప్రయాణికురాలిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో రైల్వే పోలీసులు ఆమెను నాలాసొపారాలోని అలైన్స్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం ఘటనలు తాజాగా ఉండగానే మరో సంఘటన చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
రూపాలి షిండే అనే యువతి గోరేగావ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని గోరేగావ్ స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రైలు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి ఓ ఆగంతకుడు రూపాలి తలపై పదునైన ఆయుధంతో కొట్టడం ప్రారంభించాడు. అప్పటికే రైలు కదలడంతో సహచరులు ఆమెను వెంటనే రైలులోకి లాక్కున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కేకలు వేయడంతో చీకటిని అదునుగా చేసుకుని దాడి చేసిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో రక్తంతో తడిసిపోయింది. నాలాసోపారాలో రైలు దిగిన తర్వాత జరిగిన విషయం రైల్వే పోలీసులకు చెప్పారు. వీరు కేసు నమోదుచేసి ఈ విషయాన్ని గోరేగావ్ పోలీసులకు చేరవేశారు. రూపాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.