రూపాయి దానంతట అదే సర్దుకుంటుంది
న్యూఢిల్లీ: అంతకంతకూ క్షీణించిన రూపాయి మారకం విలువ మళ్లీ దానంతటదే సర్దుకుంటుందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. వృద్ధి కూడా మళ్లీ మెరుగుపడుతుందని లోక్సభకు తెలిపారు. ఎకానమీ ఒత్తిడిలో ఉందన్న చిదంబరం.. రూపాయి పతనానికి అడుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రూపాయి ఉండాల్సిన స్థాయి కన్నా మరింత తక్కువకి పతనమైందని, మరలా కోలుకోగలదని ఆయన పేర్కొన్నారు. దేశీ కరెన్సీ విలువ అనేది ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం వంటి అనేక స్థూల ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని చిదంబరం చెప్పారు. ఇవన్నీ అధిక స్థాయుల్లో ఉన్నప్పుడు కరెన్సీ కరెక్షన్కి లోను కావడం సహజమేనని, కానీ ప్రస్తుతం ఓవర్ కరెక్షన్ జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఉత్థానపతనాలు సహజమేనని ఆయితే నిరాశావాదానికి లోను కావాల్సిన అవసరం లేదని, మళ్లీ వృద్ధి పుంజుకోగలదని చిదంబరం చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడం లేదన్న విపక్షాల ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. ఎకానమీపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు పలు చృర్యలు తీసుకున్నామన్నారు. 2012-13లో కేవలం రెండు రాష్ట్రాలే 5 శాతం కన్నా తక్కువ జీడీపీ వృద్ధి నమోదు చేశాయని, మిగతావన్నీ అంతకన్నా చాలా అధికంగానే వృద్ధి సాధించాయని చిదంబరం పేర్కొన్నారు. 2013-14లో ద్రవ్య లోటును 4.8 శాతానికి మించనివ్వకూడదని లక్ష్మణ రేఖ నిర్దేశించుకున్నామని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటబోమని స్పష్టం చేశారు. ద్రవ్య లోటును అదుపులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో నిధుల కేటాయింపు విషయంలో మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చిదంబరం చెప్పారు.