సెస్ ఎండీగా రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంది. వారం రోజులు తిరక్కముందే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎండీగా మరొకరిని నియమించింది. గతంలో జరిగిన రూ.3.08 కోట్ల అవినీతికి సంబంధించిన ఆరోపణలు.. అభియోగాలు ఎదుర్కొంటున్న ఎండీ స్వర్గం రంగారావుపై బదిలీ వేటు వేసింది. తిరిగి వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో గతంలో ఆయన పనిచేసిన ప్రాజెక్టు విభాగం జీఎంగా పాత పోస్టింగ్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా పనిచేస్తున్న రామకృష్ణను సెస్ కొత్త ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 23న ఎండీగా బాధ్యతలు చేపట్టిన రంగారావు హుటాహుటిన బదిలీ కావటం గమనార్హం. అయిదేళ్ల కిందట సెస్ ఎండీగా పని చేసిన రంగారావు హయాంలోనే సెస్ పరిధిలో దాదాపు రూ.3.08 కోట్ల అవినీతి జరిగింది. ఇప్పటికీ ఆ విచారణ కొలిక్కి రాలేదు. తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించటంలో ఆంతర్యమేమిటో అని ‘స్వర్గమా... సెస్‌కు నరకమా..’ శీర్షికతో రంగారావు నియామకాన్ని ‘సాక్షి’ ఎండగట్టింది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మరునాడే ఈనెల 22న ప్రత్యేక కథనాన్ని అందించింది.
స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం కావటంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ కథనంపై స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా ఈ బదిలీ ఫైలును పునః పరిశీలించారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ నివేదికలను పరిశీలించారు. వారం రోజులు తిరగకముందే కొత్త ఎండీగా రామకృష్ణను నియమించారు. ‘గతంలో సెస్‌లో ఎండీగా పనిచేసినప్పుడు రంగారావుపై అవినీతి ఆరోపణలున్నాయి. దానిపై విచారణ కొనసాగుతోంది. ఓ కోర్టు కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సెస్ ఎండీగా ఉంచితే విచారణకు ఆటంకం ఎదురవుతుందనే ఆయనను బదిలీ చేయటం జరిగింది...’ అని సీఎండీ కార్తికేయమిశ్రా ఈ బదిలీపై వివరణ ఇచ్చారు.