గ్రామ పరిపాలనకు తూట్లు
– జన్మభూమి కమిటీలతో సర్పంచ్లను డమ్మీ చేసిన సర్కార్
– నిధుల్ని పక్కదారి పట్టిస్తున్న వైనం
ధర్మవరం : పంచాయతీ పాలనకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారిని కాదని, సొంత పెత్తనం చేస్తోంది. సర్పంచ్లను డమ్మీలను చేసి తమ పార్టీ కార్యకర్తలతో పాలన సాగిస్తోంది. ఫలితంగా పంచాయతీల్లో స్థానిక పరిపాలన చతికలపడిందని గ్రామీణులు మండిపడుతున్నారు. జిల్లాలో 63 మండలాలకు గానూ 1003 పంచాయతీలు ఉన్నాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మురుగునీటి కాల్వలు, సిమెంట్ రోడ్లు, పాడైన పథకాలను మరమ్మతులకు నోచుకోక సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతున్నాయి. ఇక మారుమూల గ్రామాల్లో అయితే తాగునీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలైతే నేటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి.
సర్పంచ్ల పాత్ర నామమాత్రం : అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమాలకు ప్రారంభించింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్లను కాదని, తమ పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, సొంత పెత్తనానికి తెరతీసింది. పల్లెల్లో అరకొరగా చేసే అభివృద్ధి పనులను పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తూ తమను అవమాన పరుస్తోందని సర్పంచులు వాపోతున్నారు. దీనిపై సర్పంచుల సంఘం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
కేంద్ర నిధులు పక్కదారి : పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టిస్తోంది. నిధులు విడుదలైంది ఒక పనికైతే ఖర్చు చేస్తున్నది మరో పనికి. విద్యుత్ బకాయిలకు 30శాతం చెల్లించేలా జీవో జారీ చేసింది. అలాగే ఉపాధి పథకం పనులకు అడ్డదారిలో 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించి తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతోంది.
ధర్మవరం నియోజకవర్గంలో నిధుల పరిస్థితి ఇలా..!
–బత్తలపల్లి మండలంలో 14వ ఆర్థిక సంఘం నిధులు అప్రాశ్చెరువుకు రూ.3.29 లక్షలు, బత్తలపల్లి పంచాయతీకి రూ.16.88 లక్షలు, డి. చెర్లోపల్లికి రూ.3.25 లక్షలు, మూష్టూరు పంచాయతీకి రూ.3.77 లక్షలు మంజూరయ్యాయి. ఈ మండలానికి మొత్తం రూ. 51.09 లక్షల మేర 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని ఖర్చు చేసే బాధ్యత సర్పంచ్లకు కాకుండా జన్మభూమి కమిటీలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నాయకులు, అధికారులు పావులు కదుపుతున్నారు.
–ధర్మవరం మండలంలో మొత్తం 18 పంచాయతీలు ఉండగా, ఆయా పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు గానూ 14వ ఆర్థిక సంఘం కింద రూ.62 లక్షలు నిధులు మంజూరయ్యాయి. మరో రూ.5 లక్షల దాకా జనరల్ ఫండ్ ఆయా పంచాయతీలకు మంజూరైంది.
–జిల్లాలోనే అతిపెద్ద మండలమైన ముదిగుబ్బ మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉన్నాయి. ముదిగుబ్బ మేజర్ పంచాయతీకి 14ఫైనాన్స్ గ్రాంట్ రూ.72.48 లక్షలు, జనరల్ ఫండ్ రూ.49వేలు మంజూరయ్యాయి. ఈ మండలానికి మొత్తం రూ. 10 లక్షల మేర జనరల్ ఫండ్, 14వ ఆర్థిక సంఘం ని«ధులు 2.69 లక్షల మేర విడుదలయ్యాయి.
–అలాగే తాడిమర్రి మండలంలో 40 లక్షల మేర నిధులు మంజూరయ్యాయి.
జన్మభూమి కమిటీ పెత్తనం తగదు :
పంచాయతీల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్లను కాదని, ఇతర వ్యక్తుల పెత్తనమేంటి ? ఇది రాజ్యాంగ విరుద్ధం. అభివృద్ధి పనులు చేసే హక్కు సర్పంచ్లకే ఉంటుంది. అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి, ఏ పని చేసినా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నీ తెలిసిన అధికారులు గుర్తెరిగి వ్యవహరించడంపోయి.. అధికారపార్టీకి దాసోహమవటం దారుణం.
– గెలివి మధుసూదనరెడ్డి, ధర్మవరం మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు
అభివృద్ధి జరగడం లేదు :
జన్మభూమి కమిటీల వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు. ఏ నిధులు మంజూరైనా పనులు చేసేందుకు వారిలో వారే పోటీ పడుతున్నారు. ఇది మంచిది కాదు. పంచాయతీ ప్రథమ పౌరుడ్ని కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడం దారుణం. దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
- సానే సూర్యనారాయణరెడ్డి, సర్పంచ్, తంబాపురం, బత్తలపల్లి మండలం