rural area development
-
పల్లె బతుకు మారుతోందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది. సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ప్రజలకు అందుతున్న కనీస సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా సామాజిక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించనుంది. ఈ మేరకు గ్రామాలవారీగా వివరాలు సేకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో ఈ ఏడాది ఏప్రిల్ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణ యించింది. ఇందుకోసం 16 ప్రామాణికాలను నిర్దేశించిన ప్రభుత్వం.. ఆ మేరకు సమా చారాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. వంటగ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, బ్యాంకు ఖాతా, జీవిత బీమా ఉందా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకోనుంది. గర్భిణులు, 0–6 ఏళ్లలోపు చిన్నారుల సమాచారం, టీకాల వివరాలు, పౌష్టికాహార లభ్యతకు సంబంధించిన డేటా నమోదు చేయనుంది. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయా? ప్రాథమిక పాఠశాల సౌకర్యముందా? కుటుంబ సభ్యులు డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారా? పక్కా ఇళ్లు ఉన్నాయా? అనే అంశాలపై సర్వే నిర్వహించనుంది. సామాజిక పింఛన్ అందుతోందా? ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డు ఉందా? అనే వివరాలు సేకరించనుంది. వివరాల సేకరణకు ప్రత్యేక యాప్.. ప్రజల వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రజల సమాచారాన్ని నమోదు చేసేందు కు వెళ్లే ఎన్యూమరేటర్లకు యాప్‌తో కూడిన మొబైల్‌ను అందించనుంది. పదేళ్లకోసారి జనగణన నిర్వహించే కేంద్రం.. అదే సమయంలో దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల దరికి చేరుతున్నాయా? అనేది అంచనా వేసేందుకు సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తోంది. ఈ డేటా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. పథకాల అమలు తీరును సమీ క్షించి కొత్త వాటికి రూపకల్పన చేస్తాయి. ఈసారి సర్వేలో ఇంటి యజ మాని మొబైల్ నంబర్‌ను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. -
ఏడేళ్లయినా తీరని దాహం
సాక్షి, కోనరావుపేట: గ్రామస్తుల దాహార్తి తీర్చి, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చర్యల మూలంగా నిరుపయోగంగా మారుతున్నాయి. పనులు చేసినా.. అవి ఫలితాలు ఇవ్వడంలేదు. ఫలితంగా లక్షలాది రూపాయల నిధులు ఎందుకూ పనికి రాకుండా పోయాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్యాంకుతోపాటు నిధులు వృథా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మరిమడ్లలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ఐఏపీ పథకంలో 2012లో రూ.19.60 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో వట్టిమల్లలోని అజ్మీరాతండాలోని మూలవాగులో ఉన్న మంచినీటి బావినుంచి మరిమడ్ల వరకు పైప్‌లైన్ నిర్మించారు. పైప్‌లైన్ నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క చుక్క నీరు కూడా మరిమడ్లకు చేరలేదు. దీంతో మూలవాగు నుంచి మరిమడ్ల వరకు నీరు రావడంలేదు. పైపుల గుండా నీరెందుకు రావడంలేదో ఇంజనీరింగ్ అధికారులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు కారణం తెలు సుకోకపోగా పైప్‌లైన్ మధ్యలో రూ.11 లక్షలతో సంప్ నిర్మించాలంటూ ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇవే నిధులు మరో రూ.13 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. వాటర్ ట్యాంక్ పనులు పూర్తయినా ఇంతవరకు చుక్క నీరు అందులోకి ఎక్కలేదు. ట్యాంకుతో పాటు నిధులు కూడా వృథా అయ్యాయి. నిధులన్నీ పైపుల పాలు మండలంలోని మరిమడ్లలో నిర్మించిన పనులన్నీ వృథాగా మారాయి. పైప్లైన్లు నిర్మించినా పనిచేయడం లేదు. మంచినీటి బావినుంచి మరిమడ్లలో నిర్మించిన వాటర్ ట్యాంక్ సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ట్యాంకులోకి నీరు ఎక్కాలంటే నాలుగు ఇంచుల పైపులతో లైన్లు వేయాలి. కాంట్రాక్టర్లు వేసిన పైపులు మూడు ఇంచులే ఉండడం, అవి కూడా నాణ్యత లేనివి వేయడంతో నీరు పారకముందే అవి పగిలిపోతున్నాయి. బావి నుంచి ట్యాంకు వరకు వేసిన పైపుల్లో నాణ్యత లేక అనేక చోట్ల పైపులు పగిలిపోయాయి. ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత నిర్ణయం, నిర్లక్ష్యం మూలంగా అవన్నీ వృథాగా మారాయి. దీంతో గ్రామస్తులకు తిప్పలు తప్పడంలేదు. మరుగున పడుతున్న పథకం మరిమడ్లలో కొన్నేళ్ల క్రితం పైపులు వేసి వాటిని మర్చిపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. అప్పటినుంచి దీన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. కాంట్రాక్టర్ల కోసం అంచనాలనే మార్చారని, ఇందువల్ల నిర్మాణం పూర్తయినా ఫలితం కలగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధులన్నీ వృథా గ్రామంలో లక్షల వ్యయం తో నిర్వహించ తలపెట్టిన పైప్‌లైన్ ప్రాజెక్ట్ మధ్యలో నే వదిలేశారు. గ్రామంలో తాగునీటి కోసం అనేక ఇ బ్బంది పడుతున్నాం. దూ రప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి నిధులు సద్వినియో గం అయ్యే లా చూడాలి. – సింగం రాములు అధికారులు స్పందించాలి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్వహించతలపెట్టిన పైప్‌లైన్ పనులు పూర్తి చేస్తే బాగుండేది. పైప్‌లైన్ వేసినా ఇంతవరకు ఒక్క చుక్క నీరు రా లేదు. నిర్మించిన వాటర్ ట్యాంకులోకి నీరు చే రలేదు. ఈ పథకం ప్రారంభిస్తే గ్రామస్తుల నీ టి సమస్య తీరేది. అధికారులు స్పందించి నీ టి సమస్యను తొలగించాలని కోరుతున్నాం. – మాట్ల అశోక్, సర్పంచ్, మరిమడ్ల -
గ్రామీణాభివృద్ధికి కృషి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమాపార్వతి పాలకవర్గం పదవీబాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఎంపీపీ చాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతనంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందిందని చెబుతున్నా గ్రామీణప్రాంతాలు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉన్నాయన్నారు. భవిషత్తరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, లేకుంటే వారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిధుల్లో ప్రతి పైసా పేదప్రజలకు చెందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తే మావంతుగా అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న ధారూరులోని సమావేశపు హాలు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ ఎంఎల్ఏ బి. సంజీవరావు మాట్లాడుతూ జిల్లాలో ధారూరు మండలం పూర్తిగా వెనుకబడి ఉన్నందున అభివృద్ధి పనులకు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను కోరారు. గతంలో రూ.5 కోట్లు మీరే మంజూరుచేశారని అయన గుర్తు చేశారు. సమావేశంలో సునీతారెడ్డిని ఎంఎల్ఏసంజీవరావు, జెడ్పీటీసీ పి.రాములు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉమా పార్వతి. ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ధారూరు సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ యూనూస్, పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, రాములు యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, వరద మల్లికార్జున్, అవుసుపల్లి అంజయ్య, కావలి అంజయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.