స్మార్ట్సిటీపై ఆశలు
సాక్షి, కరీంనగర్ : దేశవ్యాప్తంగా వంద నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా బడ్జెట్లో ఈ పథకానికి రూ.7,060 కోట్ల నిధులను కేటాయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో స్మార్ట్‌సిటీగా కరీంనగర్ అభివృద్ధిపై నగరవాసుల్లో ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎంపీ బి.వినోద్‌కుమార్ కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ జాబితాలో నగరానికి చోటు కల్పిస్తానన్నారు. ఈ మేరకు కృషి చేసి తన హామీని, నగరవాసుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎంపీపై ఉంది.
జిల్లాకు ఒరిగేదెంత?
కేంద్ర బడ్జెట్లో ఆయా రంగాలకు అరకొర కేటాయింపులు చేయడంతో ఇందులో జిల్లాకు ఎంతమేరకు లబ్ధి చేకూరుతుందనే విషయం చర్చనీయాంశమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాల ఆధునికీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించింది. మన జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జాబితాలో ఉండటంతో నిధులు వస్తాయనే ఆశలున్నాయి. గిరిజనుల కోసం వనబంధు పథకాన్ని కేంద్రం ప్రకటించింది. మన జిల్లాలో సిరిసిల్ల, హుస్నాబాద్, మంథని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో గిరిజనులున్నారు. ఈ పథకం ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందేమోనని గిరిజనులు ఆశిస్తున్నారు.
గ్రామీణ తాగునీటి పథకాలు, గ్రామీణ విద్యుద్దీకరణ, వాటర్షెడ్ల నిర్మాణం, రక్షిత మంచినీటి పథకాలు, జాతీయ గ్రామీణ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్, మహిళల రక్షణకు నిర్భయఫండ్, బాలికల సాధికారత, 2019లోగా ఇంటింటికి మరుగుదొడ్డి, 2022లోగా అందరికీ ఇళ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిన, టూరిజం డెవలప్మెంట్, పురావస్తు కట్టడాల పరిరక్షణ, డిసెంబర్ 31లోగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఈ-ప్లాట్‌ఫాం సేవలతో పాటు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల లోపు గృహరుణాలకు వడ్డీరాయితీ తదితర పథకాల ద్వారా జిల్లాకు ఏమేరకు లబ్ధి జరుగుతుందో వేచిచూడాల్సిందే.