బడ్జెట్ బాట.. వరాల మూట
గ్రామీణ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి.. భారీగా వరాల జల్లు కురిపించింది. అందులోని ముఖ్యాంశాలివీ...
♦ రెండేళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ. అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీతో పంపిణీ. పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలు. గొర్రెల మేతకు అనువుగా అటవీ భూముల్లో స్టైలో గ్రాస్ పెంపకం.
♦ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి. పెంపకంతోపాటు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలతోపాటు రిటైల్ మార్కెట్లను నిర్మిస్తుంది
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంపు
♦ ఎంబీసీలకు (అత్యంత వెనుకబడిన కులాలు) ప్రత్యేక కార్పొ రేషన్. ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1000 కోట్లు
♦ రజక, నాయి బ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు. నాయిబ్రాహ్మణులు ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేసుకు నేందుకు ప్రభుత్వ పెట్టుబడి. రజకులకు వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ. దోబీఘాట్ల నిర్మాణం
♦ విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం. రూ.200 కోట్లు కేటాయింపు. బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ
♦ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు
♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల ప్రోత్సాహకం. ఆడపిల్లను కన్న మహిళలకు ప్రత్యేకంగా మరో రూ.వెయ్యి ప్రోత్సాహకం
♦ పుట్టిన బిడ్డల సంరక్షణకు అవసరమయ్యే 16 వస్తువులతో ‘కేసీఆర్ కిట్’ పంపిణీ. తల్లీబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమ తెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులు ఇందులో ఉంటాయి. ‘కేసీఆర్ కిట్’కు బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయింపు
♦ అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ
♦ ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆసరా ఫించన్లు. ఏప్రిల్ నుంచి అమలు
♦ సైనికుల సంక్షేమ చర్యలకు సంక్షేమ నిధి
♦ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు
♦ మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధికి రూ.350 కోట్లు
♦ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు.. సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు
♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు ఎస్సీ కాలేజీలు, కొత్త స్టడీ సర్కిళ్లు. ఒక్కో
♦ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం. మైనారిటీలకు 130 రెసిడెన్షియల్ స్కూళ్లు
♦ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు 330 గోదాంల నిర్మాణం
♦ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం దిగువన రూ.506 కోట్లతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. ఈ ఏడాది రూ.193 కోట్ల కేటాయింపు
♦ వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం. నేత కార్మికులకు రూ.1,200 కోట్లు .
♦ ఇమామ్‌లు, మౌజాములకు ఇచ్చే రూ.వెయ్యి గౌరవ వేతనం రూ.1500కు పెంపు
♦ అంగన్వాడీ టీచర్ల జీతం రూ.10,500కు పెంపు. హెల్పర్ల జీతం రూ.6,000కు పెంపు
♦ వీఆర్ఏల జీతం రూ.10,500కు పెంపు. దీనికి అదనంగా రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు రూ.5 వేల జీతం
♦ కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.600 కోట్లు. కొత్త సచివాలయం నిర్మాణానికి రూ.50 కోట్లు
♦ హైదరాబాద్‌లో మూడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. కరీంనగర్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన
♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మరో 50 వాహనాల కొనుగోలు
♦ జీహెచ్ఎంసీకి రూ.వెయ్యి కోట్లు. గ్రేటర్ వరంగల్‌కు రూ. 300 కోట్లు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు.