గ్రామీణ స్వచ్ఛ భారత్ విజేత సిక్కిం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో సిక్కిం దేశంలో మొదటి స్థానంలో, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచాయి. గుజరాత్ 14 ర్యాంకు సాధించింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గతేడాది మొత్తం 26 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే వివరాల్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ విడుదల చేశారు. ఏపీ 16 వ స్థానంలో నిలిచింది. 2015 మే-జూన్ మధ్యలో ఎన్ఎస్ఎస్ఓ ఈ సర్వే నిర్వహించింది.
స్వచ్ఛ భారత్ అమలు అనంతరం జాబితాలో మార్పులు జరిగాయని, అందులో కూడా సిక్కిం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచింది. మైదాన ప్రాంతాల్లోని 53 జిల్లాల్లో పరిశుభ్రతపై నిర్వహించిన సర్వేలో మహరాష్ట్రలోని సింధుదుర్గ్ మొదటిస్థానంలో నిలిచింది. పర్వత ప్రాంతంలోని మొత్తం 22 జిల్లాల్లో సర్వే నిర్వహించగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ తొలి స్థానం దక్కించుకుంది.