‘అమ్మ’కు బలహీనత
సాక్షి, ఒంగోలు: గ్రామీణ పేదమహిళలు, బాలికలతో పాటు పట్టణాల్లోని వారు రక్తహీనతతో బాధపడుతున్నారు. గృహిణులు, ఉద్యోగులు, పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల్లో ఈసమస్య అధికంగా ఉంది. ఒంగోలులోని ‘రిమ్స్’ ఆస్పత్రికి వివిధ రోగాలతో వచ్చి చికిత్స చేయించుకునే మహిళల్లో 70 నుంచి 85 శాతం మందిలో రక్తహీనత ఉందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ ఇవే నివేదికలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది తరచూ తమ ఆస్పత్రి పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ రక్తపరీక్షలు చేస్తున్నప్పటికీ, మహిళల్లో పెరుగుతోన్న రక్తహీనత సమస్యపై నివేదికలను జిల్లాకేంద్రానికి పంపడం లేదనే ఫిర్యాదులున్నాయి. అంటే, గ్రామీణ మహిళలంతా ఆరోగ్యకరంగా ఉన్నారని.. ఎక్కడా ఎనీమియా బాధితుల్లేరని అధికారికంగా చెప్పడానికి ప్రభుత్వ అధికారులు వెనుకంజవేయడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం ఎక్కించాలన్నా జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే రోజుకు 50 యూనిట్లు రక్తం అవసరం కాగా, ప్రస్తుతం 20 యూనిట్లు రక్తం అందించడం కనాకష్టమౌతోంది.
రక్తహీనత దుష్ఫలితాలివీ..
జిల్లాలో మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కృషిచేస్తూనే ఉన్నా ఏటా మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గకపోవడానికి కారణాల్ని అన్వేషించే నాథుడు కరువయ్యాడు. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత ఉంటే కాళ్లుచేతులకు నీరు పట్టడం, మొఖం ఉబ్బడం, శరీరం పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాల్ని గమనించవచ్చు.
ఇలాంటి బాధితులు బిడ్డల్ని ప్రసవించలేక..పురిటినొప్పులు భరించేంత బలం, శక్తి లేకపోవడంతో అధికశాతం తల్లులు మృత్యువు పాలవతున్నారు. సాధారణ మహిళల్లో నెలవారీ రుతుక్రమంతో పాటు గర్భిణుల్లో ప్రసవ సమయాల్లో జరిగే రక్తస్రావం ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముంది. అధిక రక్తస్రావం సమస్యతో మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, ఒంగోలు రిమ్స్‌ను వచ్చే రోగులు ఎక్కువగా ఉన్నారని గైనిక్ వైద్యులు చెబుతున్నారు.
సిజేరియన్ ఆపరేషన్లే అధికం..
అధికశాతం మంది గర్భిణులు నొప్పులు తట్టుకోలేక.. ప్రసవం కష్టం కావడంతో సిజేరియన్లకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 10,263 ప్రసవాలు జరగ్గా.. వాటిల్లో 3,800 సిజేరియన్ ప్రసవాలు ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 656 సిజేరియన్ ప్రసవాలు జరగ్గా.. 82 మంది మాత్రం ఇంట్లోనే పురుడు పోసుకున్నారు. మిగతావన్నీ సాధారణ ప్రసవాలున్నాయి.
ఏదిఏమైనా గర్భిణులు, బాలింతలకు ఆపరేషన్ల అవసరం ఏర్పడినా.. వారితో పాటు శిశువులు మృత్యువాత పడటాన్ని రక్తహీనతతో ముడిపెట్టి చూడాల్సిందేనంటున్నారు ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు. గతంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు జవహర్ బాల సంరక్షణ సిబ్బంది వెళ్లి రక్తపరీక్షలు చేసేవారు. అలాంటిది, వారు తూతూమంత్రం నివేదికలతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలున్నాయి.
జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సామాజిక, స్వచ్ఛంద సంఘాలు మేల్కొని జిల్లాలో రక్తం నిల్వలు అందుబాటులో ఉంచేందుకు సహకరించాలి. పోషకాహార లోపంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.