ఎంఆర్ఆర్ నిధుల అవినీతిపై విచారించండి
హైకోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల నిర్వహణ (ఎంఆర్ఆర్) పేరుతో మరమ్మతు పనులకు రూ. 384 కోట్లను నామినేషన్ల పద్ధతిపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి సంబంధిత ప్రజాహిత వ్యాజ్యాన్ని ఇటీవల హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఆర్ నిధులతో చేపట్టే పనులను టెండర్ల పద్ధతిలో కేటాయించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ వ్యాజ్యం విచారించేందుకు పిటిషనర్లు రూ. 50 వేల చొప్పున పూచీకత్తు జమచేయాలని హైకోర్టు ఆగస్టు 10న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. కేసును త్వరితగతిన విచారించాలని హైకోర్టును ఆదేశించింది.