రహదారులకు రాజయోగం
♦ దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
♦ బడ్జెట్లో రోడ్లు, హైవేలకు రూ. 55,000 కోట్లు
♦ ఎన్హెచ్ఏఐ బాండ్ల ద్వారా రూ. 15,000 కోట్లు
♦ గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,000 కోట్లు
♦ పథకంలో రాష్ట్రాల వాటా మరో రూ. 8,000 కోట్లు
♦ మొత్తం రూ. 97 వేల కోట్లతో రోడ్లకు మహర్దశ
♦ 2019 నాటికే అన్ని గ్రామాలకూ రోడ్ల అనుసంధానం
♦ వచ్చే ఏడాదిలో 10 వేల కి.మీ. హైవేల నిర్మాణం
♦ నేషనల్ హైవేలుగా 50 వేల కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు
♦ రోడ్డు ప్రయాణంలో ప్రయివేటు రంగానికి అవకాశం
♦ వాహనాలపై 1 నుంచి 4 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్సు
న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. 2016-17 బడ్జెట్లో 2.21 లక్షల కోట్ల నిధులను అందుకోసం కేటాయించింది. ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను కేవలం రహదారుల నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) సహా దేశంలో రహదారుల రంగానికి రూ. 97 వేల కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ.. రోడ్లు, హైవేలకు భారీగా రూ. 55,000 కోట్లు ఇచ్చారు. దీనికి అదనంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బాండ్ల రూపంలో రూ. 15,000 కోట్లు సమీకరించి ఖర్చు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఇక పీఎంజీఎస్‌వై కోసం మరో రూ. 19,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. సడక్ యోజన నిధులకు రాష్ట్రాల వాటా రూ. 8,000 కోట్లు కలుస్తుందని చెప్పారు. మొత్తం కలిపి రూ. 97,000 కోట్లతో దేశంలో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు.
2019 నాటికి అన్ని గ్రామాలకూ రోడ్లు...
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని మునుపెన్నడూ లేని విధంగా తాము అమలు చేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. గతంలో నిధుల కేటాయింపులు స్వల్పంగా ఉండటం వల్ల ఈ పథకం దెబ్బతిన్నదన్నారు. 2012-13లో ఈ పథకానికి రూ. 8,885 కోట్లు, 2013-14లో రూ. 9,805 కోట్లు మాత్రమే కేటాయించారని.. తాము గత రెండేళ్లలో గణనీయంగా నిధులు పెంచామని తెలిపారు. తాజా బడ్జెట్లో ఈ పథకం కింద.. కేంద్రం కేటాయించిన రూ. 19,000 కోట్ల నిధులకు రాష్ట్రాల వాటా కలిపి మొత్తం రూ. 27,000 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం చేయటం జరుగుతుందన్నారు.
దేశంలో మిగిలి వున్న 65 వేల అర్హమైన గ్రామాలనూ ఈ పథకం కింద 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని 2019 నాటికే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు జైట్లీ తెలిపారు. అలాగే.. 2011-14 మధ్య సగటున రోజుకు 73.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగితే అది ప్రస్తుతం 100 కిలోమీటర్లకు పెరిగిందని.. దీనిని మరింతగా పెంచుతామని చెప్పారు. ఇక.. దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలను వచ్చే ఏడాదిలో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నిలిచిపోయివున్న రూ. లక్ష కోట్లకు పైగా రోడ్డు ప్రాజెక్టుల్లో 85 శాతం ప్రాజెక్టులను మొదలు పెట్టటం, వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు.
రోడ్డు రవాణాలో ప్రయివేటుకు అవకాశం...
అలాగే.. రహదారుల రంగం అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్న ‘పర్మిట్ రాజ్’ (అనుమతుల విధానం)ను తొలగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం.. రహదారులపై ప్రయాణ రవాణాను మరింత సమర్థవంతంగా చేయాల్సి ఉందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రయాణ విభాగంలో ప్రయివేటు సంస్థలకు రోడ్డు రవాణా తలుపులు తెరిచేందుకు మోటారు వాహనాల చట్టానికి అవసరమైన సవరణలు చేపడతామని చెప్పారు.
కార్లు, వాహనాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు...
భారతీయ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న జైట్లీ.. అదనపు వనరులను సృష్టించటం కోసం చిన్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై ఒక శాతం చొప్పున, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, అధిక ఇంజన్ సామర్థ్యం గల వాహనాలు, ఎస్‌యూవీలపై 4 శాతం చొప్పున మౌలికసదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) సెస్సు వేయనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు.