క్షుద్ర పూజలతోనే వివాహిత మృతి
బాధితుల ఆరోపణ, మాంత్రికుడితో వాగ్వాదం.. పోలీసుల అదుపులో లక్ష్మీనారాయణ
చిన్నకోడూరు : చేతబడి చేయడం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మండలం చౌడారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకులు బుధవారం రాత్రి మంత్రాలు వేసే వ్యక్తితో గొడవకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చౌడారం గ్రామానికి చెందిన పండుగ రజిత (24) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ఆస్పత్రులు తిరిగినా జబ్బు నయం కాలేదు. అయితే రజితకు ఎవరో చేతబడి చేశారని, తనకు కొంత డబ్బులు ఇస్తే పూజలు చేసి నయం చేస్తానని అదే గ్రామానికి చెందిన కట్కోజుల లక్ష్మీనారాయణ నమ్మించాడు.
దీంతో రజిత కుటుంబసభ్యులు లక్ష్మీనారాయణకు రూ. 50 వేలు ఇచ్చారు. అతను నెల రోజులుగా క్షుద్ర పూజలు చేస్తూ, వివిధ మందును రజితకు తాపించాడు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బుధవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో భర్త రమేష్తో పాటు కుటుంబీకులు లక్ష్మినారాయణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్, ఎస్ఐ ఆనంద్గౌడ్లు అక్కడికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్ఐను వివరణ అడగగా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నామని, అయితే కేసు నమోదు చేయలేదని తెలిపారు.