గ్రామీణ టెలికం యూజర్లకు ఫ్రీ డేటా!
ఉచితంగా అందించాలని కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు క్యాష్‌లెస్ ఎకానమీకి మద్దతుగా గ్రామీణ సబ్స్క్రైబర్లకు నెల ప్రాతిపదికన ఉచితంగా కొంత డేటాను అందించాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదించింది. దీని కోసం ఒక పథకాన్నిఏర్పాటు చేసి, దీని అమలుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) నుంచి నిధులివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఉచిత డేటాను అందించాలనుకునే కంపెనీలు.. టెలికం శాఖ వద్ద రిజిస్ట్రేషన్చేసుకోవాలి. ఇవి ఇండియన్ కంపెనీస్ యాక్ట్, 1956 కింద రిజిస్టర్ అయ్యిండాలి. ఇక రిజిస్ట్రేషన్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక కంపెనీ తన రిజిస్ట్రేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరేఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు’ అని పేర్కొంది.
డిజిటల్ చార్జీలు తగ్గించాలి: శర్మ
డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి ట్రాన్సాక్షన్ (లావాదేవీల) చార్జీలను తక్కువగా ఉండేలా చూడాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ సూచించారు. డిజిటల్ లావాదేవీలు విస్తృతం కావడానికి... వ్యయం, సౌకర్యం,నమ్మకం ఈ 3 అంశాలు ప్రధానమన్నారు.