చేదు జ్ఞాపకాలుగా విద్యార్థుల బలవన్మరణాలు
విద్యాశాఖాధికారి సస్పెన్షన్ ఉపాధ్యాయుల బదిలీల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో ఆన్లైన్లో జాబితాలు ఉంచలేదనే కారణంతో కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి ఎం.నాగేశ్వరరావును ప్రభుత్వం నవంబర్ 10న సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రీజనల్ జాయింట్ డెరైక్టర్ సుబ్బారెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ నెల 24న నాగేశ్వరరావును మళ్లీ విధుల్లోకి తీసుకుని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు.
విజయవాడ : ఈ ఏడాది ఎంసెట్ అనేక ఒత్తిళ్ల నడుమ జరిగింది. మే 8న ఇంజినీరింగ్, మెడిసిన్‌కు పరీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రెండు జిల్లాల్లో ప్రవేశ పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడకుండా వివిధ సంఘాలు, పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో దాదాపు 100 వరకూ పోలీస్ జీపులు, బ్లూకార్డ్స్ ద్విచక్ర వాహనాలు వినియోగించారు.
‘పది’లో 4, 10 స్థానాలు
పదో తరగతి పరీక్షల్లో గుంటూరు జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగు, కృష్ణాజిల్లా పదో స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా 94.59 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 477 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారు. కృష్ణాజిల్లా 91.36 శాతం ఉత్తీర్ణతతో పదో స్థానంలో నిలిచింది. రెండు జిల్లాల్లో బాలికలదే అగ్రస్థానం. అలాగే, మే 9 నుంచి 11వ తేదీ వరకూ టెట్‌కమ్ టీఆర్టీ-2014 పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో 28,996 మంది, కృష్ణాలో 26,470 మంది హాజరయ్యారు.
ఇంటర్లో ‘కృష్ణా’ టాప్
ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో రెండు జిల్లాల విద్యార్థులూ మెరిశారు. ప్రధానంగా మొదటి సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా వరుసగా 11వ సారి మొదటి స్థానంలో నిలిచింది. 66 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. రెండు జిల్లాల్లోనూ బాలికల ఉత్తీర్ణతా శాతమే ఎక్కువగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సర పరీక్షల్లో 83 శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలోనూ, 76 శాతంతో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచి విద్యాకేంద్రాలు పేరును నిలబెట్టుకున్నాయి.
కార్పొరేట్‌పై ‘గంటా’ ధ్వజం
ఈ ఏడాది అక్టోబర్ 3న గుంటూరులో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్పొరేట్ కళాశాలలు చదువు పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం సరికాదని, అనుమతులు లేకుండా కార్పొరేట్ కళాశాలలు బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న వరంగల్‌కు చెందిన కె.రుషితేశ్వరి జులై 14న హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, లైంగిక వేధింపుల నేపథ్యంలో రుషితేశ్వరి మృతిచెందిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. విద్యార్థి సంఘాల నిరసనలు, ఆందోళనలు హోరెత్తాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. రుషితేశ్వరి డైరీలో రాసిన వివరాల ఆధారంగా ముగ్గురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం వర్శిటీలో పర్యటించి ప్రిన్సిపాల్ బాబూరావును తొలగించాలని డిమాండ్ చేసింది. విద్యార్థినుల పట్ల బాబూరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది.
ఈ క్రమంలో వర్శిటీ ఇన్చార్జి వీసీగా ఉన్న సాంబశివరావును రెక్టార్కే పరిమితంచేసి ఆయన స్థానంలో సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మిని నియమించారు. రుషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రాజమండ్రిలో 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం పరిహారంగా ఇచ్చింది. ప్రిన్సిపాల్ బాబును తొలగించారు. అలాగే, సెప్టెంబర్ 25న పోరంకిలోని నారాయణ క్యాంపస్‌లో ఒత్తిడి తట్టుకోలేక ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన విద్యార్థి అఖిల్‌తేజ్ కుమార్‌రెడ్డి (16) ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నెల 21న మేరీ స్టెల్లా కాలేజీలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంగిడిగూడెంకు చెందిన దొమ్మేటి భానుప్రీతి (16) కూడా ఆత్మహత్య చేసుకుంది.