ఇద్దరికీ తొలిసారి...
ఒహియో (అమెరికా): వచ్చే సోమవారం మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు ముందు... ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారులు రాఫెల్ నాదల్ (స్పెయిన్), అజరెంకా (బెలారస్) కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో వీరిద్దరూ పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్స్‌గా నిలిచారు.
యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ సిన్సినాటి టోర్నీని గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్స్‌లో నాదల్ 7-6 (10/8), 7-6 (7/3)తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలుపొందగా... అజరెంకా 2-6, 6-2, 7-6 (8/6)తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. విజేతగా నిలిచిన నాదల్కు 5,83,800 డాలర్లు (రూ. 3 కోట్ల 68 లక్షలు), అజరెంకాకు 4,26,00 డాలర్లు (రూ. 2 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో నాదల్ 1990 తర్వాత తొలిసారి ఒకే సీజన్లో అత్యధికంగా ఐదు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. ఈ క్రమంలో జొకోవిచ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు