నిమ్స్‌లో అవినీతి బాగోతం!
వైద్య విద్యార్థుల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణ
సీటీ విభాగాధిపతిపై మంత్రికి ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన నిమ్స్ డెరైక్టర్
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) కార్డియో థొరాసిక్(సీటీ) విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి.కుమార్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అడిగినంత ఇచ్చినవారిని పరీక్షలో పాస్ చేసి, ఇవ్వని వారిని ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ వైద్య విద్యార్థి జితేందర్‌సింగ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. దీంతో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ గురువారం ప్రాధమిక విచారణకు ఆదేశించారు. రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్య తీసుకుంటామని డెరైక్టర్ స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
వైద్య విద్యార్థులు ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కోర్సు చదువుతారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో ఆరుగురు విద్యార్థులు చదువుతుండగా, వీరికి ఇటీవలే తుది పరీక్ష నిర్వహించారు. పరీక్షలో పాస్ చేయాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని సీటీ విభాగాధిపతి చెప్పడంతో కొందరు ఆ మేరకు ముట్టజెప్పారు. వారిని పాస్ చేసి, మిగిలిన వారిని ఫెయిల్ చేయడంతో బాధితులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.
విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడిన అధికారులు.. విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారని డాక్టర్ ఆర్.వి.కుమార్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల్లో పాస్ చేసేందుకు తమను రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని బాధితుడు జితేందర్‌సింగ్ చెబుతున్నాడు.