ఆర్వీఎం ఉద్యోగుల్లో గుబులు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర పథక సంచలకురాలు (ఎస్పీడీ) ఉషారాణి రెండుమూడు రోజుల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన ఖరారైందని ఐదురోజుల కిందటే తెలియడంతో ఒక్కసారిగా ఆర్వీఎం శాఖలో కదలిక వచ్చింది. జిల్లాలోని సంబంధిత శాఖాధికారులు రెండు రోజులుగా హడావుడి మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ సరదాలు మానుకొని అభివృద్ధి, నిధుల ఖర్చుల లెక్కలు, జమలు సిద్ధం చేయడంలో అందరూ నిమగ్నమయ్యారు. ఆకస్మికంగా ఏ పాఠశాలకైనా తనిఖీకి వచ్చే అవకాశం ఉందని, పూర్తి రికార్డులు, సిబ్బందితో ఉండాలని ఉపాధ్యాయులను ఆర్వీఎం అధికారులు సూచిస్తున్నారు. పథకానికి వచ్చిన నిధులతో చేపట్టిన అరకొర అభివృద్ధి పనులను చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇంతవరకూ ని ధులు వెచ్చించి చేపట్టిన వివిధ పనుల నివేదికలను తయారు చేయాలని సూచించారు. దీంతో ఆయా నివేదికల తయారిలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలమునకలయ్యారు. అదేవిధంగా రెండురోజుల పాటు ఏ ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు పెట్టడానికి వీల్లేదని అనధికార ప్రకటన కూడా జారీ చేశారని తెలుస్తోంది.
అభివృద్ధి పనులు అంతంతమాత్రమే..
ఆర్వీఎం పథకం ద్వారా చేపట్టాల్సిన విద్యాభివృద్ధి పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా బడిబయట ఉన్న పిల్లలను అందుబాటులోని పాఠశాలలకు పంపించడం, యూనిఫారంల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. అదే విధంగా అవసరమున్న పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం, బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యం కోసం శానటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ పనులేవీ పెద్దగా చేయకపోవడంతో ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 06-14 మధ్య వయస్సు గల బడి బయట పిల్లలు కేవలం 2,614 మంది ఉన్నారని ఆర్వీఎం శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే నిజానికి బయబయట పిల్లల సంఖ్య వేలల్లో ఉంటుందని ఉపాధ్యాయులే స్వయంగా చెబుతుండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వినికిడి సాధనాలు, చేయూత పరికరాలు అందజేయడంలో గందరగోళం ఏర్పడింది. గతేడాది గుర్తించిన లబ్ధిదారులకు కేవలం 400 మందికి మాత్రమే పరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇటీవల చేపట్టిన అంగవైకల్యం గుర్తింపు కార్యక్రమం తుది జాబితా ఇంకా ఖరారు కాలేదు. ‘సివిల్ వర్క్‌డే’ పేరుతో దినోత్సవాలు నిర్వహించినప్పటికీ అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు లక్ష్యాలను దాటలేదు. గతేడాదిలో మంజూరైన 719 అదనపు భవన నిర్మాణాలకు గాను కేవలం 99 భవనాలు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. జిల్లాలోని కేజీబీవీ వసతి గృహాల్లో 25,581 మంది బాలికలుంటే ఈ ఏడాది ఇప్పటికీ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయలేదు.
అమలుకు దూరంగా ‘విద్యాహక్కు’
‘విద్యాహక్కు చట్టం’ అమలులో భాగంగా పాఠశాల స్థాయిలోని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ)కు చట్టంపై అవగాహన కల్పించడం, ర్యాలీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఆలస్యంగానైనా ఇటీవల ఎస్ఎంసీ కమిటీల ఎన్నిక ప్రక్రియలను పూర్తిచేసుకున్నప్పటికీ విద్యాహక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించిన పాపాన పోలేదు. నెలకు ఒక్కో సమావేశం కూడా నిర్వహించడం లేదు.
‘సీట్ల’కోటా ఈ ఏడాదికి లేనట్టే
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ప్రతి తరగతిలోనూ కేటాయించాల్సి ఉంది. దీనికోసం ముందుగా జిల్లా స్థాయిలో ప్రైవేటు పాఠశాలలు, సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, తదితర అంశాలపై సర్వే చేపట్టి ఇప్పటికే నివేదికలు సిద్ధం చేయాలి. అయితే ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా ఈ అవకాశం పేద విద్యార్థులకు అందదు.
రవాణా చార్జీల ఊసేలేదు...
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా రవాణా ఇబ్బందులున్న పాఠశాలలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ‘నైబర్‌హుడ్’ పాఠశాలలుగా గుర్తించి, వాళ్లకు రవాణా సదుపాయాన్ని కల్సించాల్సి ఉంది. వాహన సౌకర్యంలేని వాళ్ల సంఖ్యను బట్టి వాహనాన్ని ఏర్పరచాలి, లేకపోతే రవాణా చార్జీలను విద్యార్థులకు మంజూరుచేయాల్సి ఉంటుంది. అయితేజిల్లాలో నై బర్హెడ్ స్కూళ్లను ఇంతవరకూ గుర్తించే ప్రక్రియను మం డల విద్యాశాఖ అధికారులు పూర్తి చేయలేదు. ఇటువం టి తరుణంలో ఎస్పీడీ పర్యటన ఉండడంతో ఏమి చే యాలో తోచక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.