ఆర్వీఎంకు ఊరట
- రూ.192.69 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సుముఖత
- పెండింగ్ పనుల పూర్తి, కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధుల కొరతతో సతమతమవుతున్న రాజీవ్ విద్యామిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఊరట కలిగింది. ఆ శాఖ రూపొందించిన వార్షిక ప్రణాళికకు కొంత మెరుగులు దిద్దిన కేంద్రం ప్రభుత్వం.. నిధుల మంజూరుకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్‌కు 2014-15 వార్షిక సంవత్సరంలో రూ.192.69 కోట్ల బడ్జెట్ విడుదల కానుంది. దీంతో గతంలో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇక కొత్త కార్యక్రమాలు...
రాజీవ్ విద్యామిషన్ నిధుల విడుదలలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పాత నిధులను ఖర్చు చేస్తేనే కొత్తగా బడ్జెట్ ఇస్తామని స్పష్టం చేయడంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎం నిధులకు భారీగా కోత పడింది. ఫలితంగా గతేడాది కేవలం రూ.124.54 కోట్లు విడుదల కాగా.. ఇందులో రూ.80కోట్లు ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేశారు.
తాజాగా బడ్జెట్ పరిమితి పెరిగింది. ఈ ఏడాది రూ.192.69 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో.. అధికారులు కొత్త కార్యక్రమాల కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనులకు సైతం నిధులు సంతృప్తికరంగా రావడంతో పల్లె బడులకు అదనపు గదులు నిర్మించేందుకు ఆర్వీఎం అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
పనితీరులో వెనకబడితే నిధుల్లో కోత..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆర్వీఎంకు నిధుల విడుదల మెరుగుపడినప్పటికీ.. పనితీరును బట్టి నిధులు విడుదల కానున్నాయి. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఆర్వీఎం లక్ష్యాలు, సాధించిన పురోగతి ఆధారంగా తదుపరి త్రైమాసికానికి నిధులు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనితీరులో వెనకబడితే నిధుల విడుదలలో కోతపెట్టనుంది.
దీంతో ఆర్వీఎం అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలలు ఎన్నికల హడావుడిలో కొన్ని కార్యక్రమాలు వెనకబడ్డాయి.అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేయకుండా నిల్వ ఉన్న నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే జిల్లా ఆర్వీఎంలో అంతంతమాత్రంగా నిధులుండగా.. ప్రస్తుత నిధులు వినియోగించుకుని ఉద్యోగులకు వేతనాలు అందించారు. ఇందుకు సంబంధించి నివేదికను కేంద్రానికి పంపితే.. రెండో త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి.
కొత్త ప్రణాళికలో ముఖ్యాంశాలివీ..
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్వీఎంకు రూ.192.69కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.
- ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాల కోసం రూ.80.55 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణల కోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నారు.
- పాఠశాల్లో మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు ఖర్చు పెట్టనున్నారు.