ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.