సిండికేట్ బ్యాంక్ లాభం రూ.470 కోట్లు
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 470 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం(రూ.463.37 కోట్లు)తో పోల్చితే 1.4 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ సీఎండీ ఎస్.కె. జైన్ సోమవారం తెలిపారు. అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం స్వల్పంగానే వృద్ధి చెందిందని వివరించారు.
గత క్యూ2లో రూ.318 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.341 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 3.26 శాతం నుంచి 2.89 శాతానికి తగ్గిందని, మొత్తం ఆదాయం రూ. 4,546 కోట్ల నుంచి రూ.4,850 కోట్లకు పెరిగిందని తెలిపారు. క్విప్ విధానంలో రూ.1,500 కోట్ల నిధులు సమీకరించడానికి బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు.