లినెన్ వాటా 0.2 శాతమే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ వస్త్ర రంగంలో లినెన్ వాటా ప్రస్తుతం 0.2 శాతమే. ఉన్ని 2 శాతముంది. కొరత కారణంగా ఈ వస్త్రాలు ఖరీదైనవని ఆదిత్యా బిర్లా గ్రూపుకు చెందిన జయ శ్రీ టెక్స్టైల్స్ డొమెస్టిక్ టెక్స్టైల్స్ సీఈవో ఎస్.కృష్ణమూర్తి తెలిపారు. జేఎన్టీయూ సమీపంలో ఏర్పాటైన ఐరిస్ లినెన్ క్లబ్ ఎక్స్‌క్లూజివ్ షోరూంను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లినెన్ తయారీకి అవసరమైన అవిసె(ఫ్లాక్స్) మొక్కలు బెల్జియం, ఫ్రాన్స్‌లో మాత్రమే అభిస్తాయని వివరించారు. ఇక లినెన్ వస్త్ర పరిమాణం మొత్తం దేశంలో రూ.2 వేల కోట్లుంది.
అగ్రస్థానంలో ఏపీ: లినెన్ దుస్తుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కృష్ణమూర్తి తెలిపారు. కంపెనీకి రిటైల్ వ్యాపారంలో రాష్ట్రం నుంచే అధికంగా 22% ఆదాయం సమకూరుతోందన్నారు. దేశవ్యాప్తంగా 89 షోరూంలు ఉంటే, రాష్ట్రంలో వీటి సంఖ్య 19 ఉందన్నారు. 2017 కల్లా ఔట్లెట్ల సంఖ్యను 250కి చేరుస్తామని, తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టోర్ల సంఖ్య 50 అవుతుందని చెప్పారు. మీటరు వస్త్రం రూ.10 వేలు ఖరీదు చేసేవి ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. షోరూంలో వస్త్రాల ధర మీటరుకు రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉందని ఐరిస్ లినెన్ ఎండీ పి.అమృతవర్ధన్ రావు తెలిపారు.