నిబంధనలు పాటించాలి
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..
ఈనెల 12 నుంచి 19వ తేదీవరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవుదినాలైన 13, 14, 18 తేదీల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. ఈనెల 21న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టరు, సహాయ రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ కలెక్టర్ వేణుగోపాల్ వ్యవహరిస్తారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టరు, సహాయ రిటర్నింగ్ అధికారిగా సివిల్ సప్లయీస్ అధికారి రమేష్ వ్యవహరిస్తారు.
పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే వారు కలెక్టరేట్‌లోగల రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయాలి.పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేవారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25వేలు, శాసనసభ అభ్యర్థిగా నామినేషన్వేసేవారు రూ.10వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పార్లమెంట్‌కు రూ.12,500, శాసన సభకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తే సరి. ఈ డిపాజిట్లను నగదుగాగానీ, ట్రెజరీ చలానా రూపంలో మాత్రమే చెల్లించాలి.
నామినేషన్ పత్రాలతోపాటు అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాలి, అఫిడవిట్లోగల ప్రతీ కాలం తప్పనిసరిగా పూరించాలి. అసంపూర్తిగా ఉన్న అఫిడవిట్లను పరిశీలన సమయంలో తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.
నామినేషన్ పత్రాలు ఇతర డాక్యుమెంటేషన్‌తో అభ్యర్థితోపాటు నలుగురు మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు రావాలి. 200 మీటర్ల బయట వరకు మాత్రమే ఊరేగింపులు, వాహనాలు అనుమతిస్తారు. ఊరేగింపులకు 48 గంటల ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలి.
అఫిడవిట్ పత్రాలకు సంబంధించి మొదటి పేజీలో రూ.10 విలువగల స్టాంపు పేపరు, అభ్యర్థి సంతకం నోటరీ అటిస్టేషన్ చేయించాలి. ప్రతీ పేపరుపై అభ్యర్థి సంతకం నోటరీ అటిస్టేషన్ ఉండేలా చూడాలి.ఆన్‌లైన్‌ద్వారా కూడా అఫిడవిట్, నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశముంది.పై వివరాలను నోటీసు బోర్డు, వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది.
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు..
తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన వారిపై భవిష్యత్తులో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా జాతీయ బ్యాంకులో వ్యక్తిగత ఖాతా తెరవాలి. ఈ ఖాతా ద్వారానే ఎన్నికల ఖర్చులు చేపట్టాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రంతోపాటు ఈ బ్యాంక్ ఖాతా నంబరును జతపరచాలి.అభ్యర్థి సొంత నియోజకవర్గానికి చెందిన ఓటరు కాకపోతే ఏ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో పేరు ఉందో ఆ జాబితాను సర్టిఫై చేయించి నామినేషన్ పత్రంతో జతపరచి సమర్పించాలి.
వినుకొండ, మాచర్ల, గురజాల పెదకూరపాటు నియోజక వర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టరు వివేక్‌యాదవ్, డీఆర్వో కె.నాగబాబు, రూరల్, అర్బన్ ఎస్పీలు జె.సత్యన్నారాయణ, జెట్టి గోపీనాథ్, పార్టీల నాయకులు ఆంజనేయులు (కాంగ్రెస్), ఎం.సుబ్బారావు(టీడీపీ), వైవీ సుబ్బారావు(బీజేపీ), కాళిదాసు, రమాదేవి(సీపీఎం), వాసు(బీఎస్పీ)తదితరులు పాల్గొన్నారు.