వీరులారా వందనం...రాష్ట్ర సాధనకు అనేకమంది ఆత్మబలిదానం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎంతోమంది ఆత్మబలి దానాలతో నేటి స్వరాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు గురువారం అమరవీరుల సంస్మరణ దినో త్సవం నిర్వహించనున్నారు. అమరుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ ఆత్మబలి దానం చేశారు. వీరిలో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి సాయం అందింది. మరికొందరికి స్థాని క నాయకులు, రాజకీయ పార్టీల నుంచి సాయం అందింది. ఇప్పటికీ తమ కుటుంబాలకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిలో 27మందికి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొందరికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కొంతమంది అమరుల కుటుంబాలకు ఎటువంటి సాయం అందలేదు. బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పిన్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి భార్య పద్మకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ పరంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశారు.
● 2012లో ఆదిలాబాద్‌కు చెందిన సంతోష్ హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతుండేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఓయూ క్యాంపస్‌లో ఆర్ట్స్ కాలేజీ ముందే ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణత్యాగం చేశాడు. ఆత్మహత్యతో ఓయూ అట్టుడికింది. అమరుని కుటుంబానికి రూ.పది లక్షల సాయం అందింది.
● 2013లో ఆదిలాబాద్ మండలం యాపల్గూడకు చెందిన పుంద్రువార్ నర్సింగ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పట్లో ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ఈయన కుటుంబంలో ఒకరి ఉద్యోగం, రూ.పది లక్షల సాయం అందింది.
అమరుల కుటుంబాలకు te
● బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్, రాజు అనే ఇద్దరు యువకులు కూడా స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్య కేసు పోలీ సు రికార్డుల్లో నమోదు కాలేదు. అందువల్ల ఇరువురు బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందలేదు. ఉద్యోగ అవకాశం కల్పించలేదు.
● చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామానికి చెందిన ముత్యాల రాజగౌడ్, సుబ్బారాంపల్లి గ్రామానికి చెందిన బిల్కి మహేష్ ప్రాణత్యాగం చేశారు.
అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలే..
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతా యని అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే ఇప్పటికీ వారి ఆకాంక్షలు నెరవేరలే. కుటుంబ, గడీల పాలనలో సామాజిక న్యాయం జరగలేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు. నేటికీ రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
– దుర్గం భాస్కర్, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి