అయ్యోపాపం! దీపిక ఓ శాడ్ సెల్ఫీ!!
సినిమా షూటింగ్ కూడా సినీ తారలకు ఓ ప్రయాణంలాంటిదే. షూటింగ్ సాగినంతకాలం చాలావరకు చిత్రయూనిట్ అంతా కుటుంబసభ్యుల్లా ఆత్మీయంగా ఆప్యాయతలు కలబోసుకుంటారు. అలాంటి స్నేహపూర్వక చిత్రయూనిట్ షూటింగ్ ముగిసి.. ఎవరింటికి వారు వెళుతున్నారంటే.. కొంచెం బాధే కదా! అలాంటి బాధలోనే దీపికా పదుకొణే ఇప్పుడు మునిగిపోయింది. ఆమె ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' షూటింగ్ తాజాగా ముగిసింది.
ఈ విషయాన్ని చిత్రంలో సహ నటీమణులైన దీపికా పదుకొణే, నీనా డొబ్రెస్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. షూటింగ్ చివరి రోజున విడిపోతున్నామన్న బాధతో ఈ ఇద్దరు కలిసి ఓ విషాద సెల్ఫీ దిగారు. తెగ బాధపడిపోతూ.. కళావిహీనమైన ముఖాలతో, బాధాతప్త భావోద్వేగాలతో ఈ సెల్ఫీలో కనిపిస్తున్న ఈ ఇద్దరిని చూసి.. అభిమానులూ తెగ ఇదయిపోతున్నారు.
2002 నాటి హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'ట్రిపుల్ ఎక్స్'కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్టులో విన్ డీజిల్ సరసన దీపికా పదుకొణే, నినా డొబ్రెవ్ నటిస్తున్నారు. దీపికతో తీసుకున్న 'శాడ్ సెల్ఫీ' గురించి నీనా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. 'చివరిరోజు వచ్చేసింది. అద్భుతమైన సాహస ప్రయాణం ముగియడం బాధ కలిగిస్తోంది. నా కొత్త కుటుంబమైన ట్రిపుల్ ఎక్స్‌ను విడటం బాధ కలిగిస్తోంది. ఎంతో అకుంఠిత దీక్ష, పని పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులందరినీ మిస్ అవుతున్నాను. చిత్రయూనిట్లో ఎంతో అందమైన మనస్సున్న వ్యకులున్నారు. వారి కృషిని ఎంత అభినందించినా తక్కువే. ఎంతో కష్టమైన ఈ షెడ్యూల్‌ను పూర్తిచేసినందుకు వారాంత ఇక సేదదీరొచ్చు. ఇక విశాంత్రి కావాల్సినంత తీసుకోవచ్చు' అని పేర్కొంది.