బయటపడుతున్న సాదత్‌ఖాన్ లీలలు
వితంతువులు, విడాకులు పొందిన సంపన్న స్త్రీలే టార్గెట్
ఖాకీలను కలుస్తున్న బాధితులు
బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళలను పరిచయం చేసుకుని వివాహం చేసుకుంటానని నమ్మించి లక్షల రూపాయల దోచుకుని పోలీసులకు పట్టుబడిన వంచకుడు సాదత్‌ఖాన్ లీలలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వితంతువులు, విడాకులు పొందిన శ్రీమంత మహిళలను మాయమాటలతో బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణ లో వెలుగుచూసింది.
సాదత్‌ఖాన్ అరెస్టైన విషయం తెలియగానే పలువురు బాధిత మహిళలు బాగలూరు పోలీసులను కలిసి న్యాయం చేయాలని కోరుతున్నారు. వారి స్వస్థలాల్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితులకు సలహా ఇస్తున్నట్లు బెంగళూరు ఈశాన్యవిభాగం డీసీపీ పీఎస్.హర్ష తెలిపారు. హాసన్‌కు చెందిన సాదత్‌ఖాన్ (28) అనే మోసకారి తాను సంపన్నుడిని, సీఈవోని అంటూ ప్రొఫైల్స్ తయారుచేసుకుని మహిళలను మాయమాటలతో వంచిస్తూ ఒక కేసులో మంగళవారం దొరికిపోవడం తెలిసిందే. వితంతువులు, విడాకులు తీసుకున్న, డబ్బున్న మహిళలను గుర్తించి పెళ్లిచేసుకుంటానని నమ్మించేవాడు. వారి నుంచి డబ్బు గుంజేవాడు. అనేకమందితో శారీరకంగా కూడా వాంఛలు తీర్చుకున్నాడు.
ఒక మహిళతో మాట్లాడడానికి ఒక సిమ్‌నే వాడేవాడు. మహిళల నుంచి కాజేసిన లక్షలాది నగదుతో విమానాల్లో సంచరిస్తూ విలాస జీవితం గడిపేవాడు. ఇతడు విలాసాల కోసం రూ.50 లక్షల వరకు ఖర్చుచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఇతని వద్ద పైసా కూడా లభించలేదని డీసీపీ హర్ష తెలిపారు. ఇంతవరకు సుమారు వందమందికి పైగా మహిళలను వంచనకు పాల్పడినట్లు వెలుగులోకి రాగా వారిసంఖ్య ఇంకా పెరుగవచ్చని చెబుతున్నారు. హిందీలో అనర్గళంగా మాట్లాడే ఇతడు ఎక్కువగా రాష్ట్రంలో స్థిరపడిన ఉత్తరాది మహిళలకే వలవేసినట్లు సమాచారం.