సకల శుభాలకు నాంది ఉగాది
♦ దుర్ముఖి నామ ఉగాదికి అంతా రెడీ
♦ వేడుకలకు సిద్ధమైన జిల్లావాసులు
♦ కుండలు, పచ్చడి సామగ్రి కొనుగోలు
♦ ఇంటింటా ఇష్టమైన భక్షాలు..
♦ పంచాగశ్రవణం కోసం ఆలయాల్లో ఏర్పాట్లు
రుతువుల్లో అందరినీ మైమరిపించేది వసంత రుతువు. శిశిరంలో ఎండిపోయిన చెట్లన్నీ వసంత కాలంలో చిగుళ్లు తొడిగి పచ్చగా కళకళలాడుతూ కొత్త అందాలతో అలరిస్తాయి. అందుకే ఈ రుతువును అత్యంత మనోహరమైనది, ఆహ్లాదకరమైనదిగా చెబుతారు. నూతన తెలుగు సంవత్సర ఆరంభానికి ఈ రుతువునే కొలమానంగా తీసుకున్నారు. వసంతంలో వచ్చే తొలిమాసం చైత్రం. తిథుల్లో మొదటి గౌరవం దక్కేది పాడ్యమి. బ్రహ్మ పురాణం అనుసరించి బ్రహ్మ సృష్టిని ఆరంభించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజును నూతన తెలుగు సంవత్సరాదిగా పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. - దోమ/ఘట్కేసర్టౌన్/షాబాద్
ఉగాది పచ్చడిలో షడ్రుచులు..
ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆరు రుచులతో (షడ్రుచులు) కూడిన పచ్చడి. పండుగ రోజున ఏ ఇంట్లో చూసినా ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వ గరు వంటి 6 రుచులతో కూడిన పచ్చడి ఘుమఘుమలే కనిపిస్తాయి. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన కొత్త కుండల్లోనే ఈ పచ్చడిని తయారు చేయడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. ఉగాది పచ్చడి తాగితే చక్కటి ఆరోగ్యంతో పాటు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు విలసిల్లుతాయని ప్రజల నమ్మకం.
ఆరురుచుల ప్రత్యేకతలు: చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతు వాపు వంటి లక్షణాలను అరికడుతుంది. ఉప్పు ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. చెరకు ముక్కలు, అరటి పళ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
పచ్చడి తయారుచేసే విధానం..
కావాల్సిన వస్తువులు: ఒక స్పూన్ వేపపువ్వు రేకులు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, 6 అరటి పళ్లు, చింతపండు, మామిడి కాయలు, 100 గ్రాముల బెల్లం, ఒక పచ్చి మిరపకాయ, చిటికెడు ఉప్పు, 2 ఏలకులు, 2 గ్లాసుల నీళ్లు.
తయారీ విధానం: ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, మిరపకాయ, మామిడికాయలను చిన్న ముక్కలుగా చేసి విడివిడిగా పెట్టాలి. పేప పువ్వును శుభ్రపరచి రేకులను ఓ పక్కన పెట్టాలి. ఏలకులు గుండుగా చేసి అట్టిపెట్టాలి. 2 గ్లాసుల నీళ్లలో చింత పండును బాగా చిలికి, పులుపు నీళ్లను ఓ గిన్నెలోకి వడపోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అరటిపళ్లను ముద్దగా చేసి నీళ్లలో కలపాలి. అందులో చిటికెడు ఉప్పు, ఏలకుల పొడి, చెరకు, మిరపకాయ, మామిడి ముక్కల్ని వేసి బాగా కలపాలి.
పండుగ సాంప్రదాయాలు
ఉగాది పండుగకు 15 రోజుల ముందు నుంచే గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లకు సున్నం, రంగులు వేయడం, అందంగా అలంకరించడం ప్రారంభం అవుతుంది. పండుగ రోజున ఇళ్లంతా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు, పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరిస్తారు. ఈ రోజున అభ్యంగన స్నానం ఆచరించడడం, గంగాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త దుస్తులను ధరించడం ఓ ఆనవాయితీ. ముఖ్యంగా ఎండల నుంచి ఉపశమనం కోసం తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ఎక్కువగా ధరిస్తారు.
నోరూరించే భక్షాలు..
ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే భక్షాలు (పోలెలు). ఎన్ని వంటలున్నా వీటిని రుచి చూడడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. సాధారణంగా పండుగకు ఒకరోజు ముందే భక్షాలను సిద్ధం చేసి ఉంచుతారు. ముందుగా శనగ పప్పుతో చక్కెరను జత చేసి దానిని బాగా గ్రైండర్లో వేసి రుబ్బి పూర్ణంగా మారుస్తారు. అనంతరం గోధుమ పిండితో చిన్నచిన్న ముద్దలు తయారు చేస్తారు. ఈ ముద్దల మధ్యన కొద్దికొద్దిగా పూర్ణాన్ని ఉంచి పెనంపై వేసి వేడి చేస్తే భక్షాలు సిద్ధం అయినట్లే. ఇలా తయారు చేసిన భక్షాలను అందరూ ఇష్టంగా తింటారు.
పంచాంగ శ్రవణం..
ఉగాది నాడు పంచాంగ శ్రవణం ప్రధానఘట్టం. దీని వెనుకా అనేక కారణాలున్నాయి. ఖగోళ శాస్త్రీయ ధృ క్కోణానికి అద్దం పట్టే సాంప్రదాయంగా పండితులు దీనిని పేర్కొంటారు. ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు ఉంటాయి. చంద్రుడి నడకకు సంబంధించినది తిథి. వారంలోని ప్రతీ రోజును ఓ గ్రహానికి ఆదిదేవతగా భావించి ఆ రోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు. రాశి చక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు. నక్షత్రరాశిలో సూర్యచంద్రుల స్థితిని బట్టి యోగం లెక్కకడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. వాటన్నింటినీ ఆధారంగా చేసుకొని కొత్త సంవత్సరంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఏఏ పంటలు వేస్తే బాగుంటుంది, వానలు పడే సమయం తదితర విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా ప్రజలు తెలుసుకుంటారు.