ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం కానుంది
వాషింగటన్ : భవిష్యత్తులో ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారనుందంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్యలతో తెగబడుతున్న వారికి పాక్ సురక్షిత ప్రాంతంగా తయారు కానుందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో దేశప్రజలను ఉద్దేశించి అమెరికా కాంగ్రెస్ లో ఒబామా తన చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్, ఆప్ఘాన్ దేశాల్లో ఉగ్రవాద చర్యలు రోజురోజుకు పెరుగుతూ ఉండటం ఆందోళనకరమైన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.
సెంట్రల్ అమెరికా సహా ఆసియా, ఆప్రికాలోని కొన్ని దేశాల్లో ఉగ్రవాదం లేనప్పటికీ ఆయా ప్రాంతాల్లో అస్థిరత నెలకొని ఉందన్నారు. ఈ పరిస్థితులను తమకనుకూలంగా మరల్చుకునేందుకు అలైఖైదా, ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ఒబామా ఆరోపించారు. తన మీద, అమెరికా చిత్తశుద్ధిమీద అపనమ్మకముండాల్సిన అవసరం లేదన్నారు. దీనికి తాము మట్టుబెట్టిన ఆల్ ఖైదా నేత యెమెన్ ఉదంతమే నిదర్శనమన్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఆ ఉగ్రవాద గ్రూపులపై దృష్టి పెట్టాల్సిన అసవరం ఉందన్నారు. దాదాపు 10,000 వైమానిక దాడులతో వారి నాయకత్వాన్ని వారి చమురు, వారి శిక్షణ శిబిరాలు, మరియు వారి ఆయుధాలను టార్గెట్ చేశామని వెల్లడించారు. ఇరాక్ మరియు సిరియా లో భూభాగంలో చెలరేగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తమ మద్దతు , సహాయాన్ని అందిస్తున్నామన్నారు.
ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా అమెరికాను టార్గెట్ చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమెరికాను ఎవరూ అస్థిరపరచలేరని వెల్లడించారు. రక్షణ రంగంలో తమ దేశంలో ఎంత బలీయమైనదో ఇప్పటికే ప్రపంచం తెలుసుకుందని ఒబామా తెలిపారు.