అభివృద్ధి కోసమే దత్తత
- రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిశోడియా
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్పీ సిశోడియా అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగానే అధికారులు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారని అన్నారు. గురువారం సాగర పంచాయతీలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడివారు గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో ఆయనకు స్వాగతం పరికారు. అనంతరం కిల్లోగుడ ఆశ్రమ పాఠశాల ఆవరణంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాకపోవడం వల్లే గిరిజన గూడేల్లో మౌలిక వసతులు కోరవడ్డాయన్నారు. అభివృద్ధి పనుల్లో స్థానికుల భాగస్వామ్యం లేకపోవడం కూడా ఒక కారణమన్నారు.
అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, రోడ్డు, విద్యుత్ వంటివి సక్రమంగా అమలైతే అదే స్మార్ట్ విలేజని పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో హరినారాయణన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకే సీనియర్ ఐఏఎస్ అధికారులు గ్రామాల దత్తత కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు పంచాయతీలోని వారంతా సమావేశమై చర్చించుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూ ఈఈ ఎంఆర్జీ నాయుడు, సాగర సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ ఎస్.లావణ్య, టీడబ్ల్యూ జేఈ సిమన్న, ఆర్డబ్ల్యూఎస్ జేఈ రాజేష్ పాల్గొన్నారు.