పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సహార్ ఏటీసీ
సాక్షి, ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ (సహార్) అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. విమానాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఒకటి. ఇక్కడ ఏటీసీ టవర్ను 83.8 మీటర్లు అంటే దాదాపు 30 అంతస్తుల ఎత్తులో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడున్న ఏటీసీ టవర్ కంటే కొత్త నిర్మాణం 20 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంది. దీన్ని 2013 అక్టోబరులోనే ప్రారంభించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పాత, కొత్త ఏటీసీ టవర్ల సమన్వయంతో విమానాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
ఇప్పుడు పాత ఏటీసీ టవర్ను పూర్తిగా మూసివేశామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అందులోని విద్యుత్ పరికరాలు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక యంత్రాలన్నింటినీ కొత్త ఏటీసీ టవర్లోకి తరలించారు. దీంతో బుధవారం నుంచి కొత్త ఏటీసీ టవర్ పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. ఈ కొత్త టవర్ నుంచి విమానాశ్రయం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల దూరం వరకు 360 డిగ్రీల కోణంలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా విమానాల రాకపోకలపై కంట్రోలర్లు నిఘా వేయవచ్చు. 2,884 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ టవర్పైన ఒక షిఫ్టులో 10 మంది క ంట్రోలర్లు, 12 మందికిపైగా ఇంజినీర్లు విధులు నిర్వహిస్తున్నారు. పాత ఏటీసీని త్వరలో నేలమట్టం చేయనున్నారు. విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న జీవీకే గ్రూపు కంపెనీకీ ఆ స్థలాన్ని అప్పగించనున్నారు. అదనంగా లభించే ఈ స్థలంతో మరిన్ని విమానాల సేవలు ప్రారంభిస్తారు. మొత్తం రూ.120 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఏటీసీ టవర్ దేశంలోనే అత్యంత ఎత్తయినదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో 102 మీటర్ల ఎత్తయిన ఏటీసీ టవర్ నిర్మాణంలో ఉంది. అది పూర్తయ్యేంత వరకు ముంబై విమానాశ్రయానికే ఆ ఘనత దక్కనుంది.