వెంకన్నకే లడ్డూనా...వెళ్ళు స్వామీ!
తిరుమల వెళ్లి వెంకన్నకే లడ్డూలు అమ్మితే ఎలా ఉంటుంది? అన్నవరం వెళ్లి అక్కడి పసందైన ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామికి అమ్మితే ఎలా ఉంటుంది? పుస్తకం రాసిన రచయితకే దాన్ని అమ్మితే ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుంది కదా? ఇటీవల అలాంటి కామెడీనే జరిగింది. ‘సాహస వీరుడు - సాగర కన్య’లో కథానాయికగా నటించిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఎదురైన అనుభవం ఇది. రచయిత ల్యూక్ కౌటినోతో కలసి ఆమె ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ అనే పుస్తకం రాశారు. గత ఏడాది నవంబర్లో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లే కాదు... లేనివాళ్లు కూడా అవగాహన కోసం ఈ పుస్తకం కొంటున్నారు.
ఇప్పటికీ అమ్మకం జోరుగానే ఉంది. బుక్ షాప్స్లోనే కాదు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఈ బుక్ దొరుకుతోంది. ఇటీవల ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర శిల్ప కారు ఆగినప్పుడు ఓ వ్యక్తి కారు అద్దాన్ని ట్యాప్ చేయడంతో, ఆమె తెరిచారు. ఆ వ్యక్తి ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకం పట్టుకుని నిలబడి, ‘కొంటారా మేడమ్?’ అంటూ శిల్పాశెట్టిని చూసి, నాలుక కరుచుకున్నాడు. అది చూసి, శిల్పా శెట్టి పగలబడి నవ్వేశారు. మరి.. రాసినోళ్లకే పుస్తకం అమ్మితే కామెడీగా ఉండదూ! ‘వెంకన్నకే లడ్డూనా.. వెళ్ళు సామీ’ అన్నట్లు ఆ వ్యక్తిని సరదాగా చూశారట శిల్పా శెట్టి.
ఆ సంగతి అలా ఉంచితే... శిల్ప వయసు ఇప్పుడు 40. ఒక బిడ్డకు తల్లి కూడా! అయినా ఆమె తల్లి కాక ముందు, పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. దానికి కారణం - ఆమె చేస్తున్న యోగా, తీసుకుంటున్న ఆహారం. ఆరోగ్యం గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని యోగా డీవీడీ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈ బుక్ రాశారు! మొత్తానికి, సినిమాతో పాటు ఇప్పుడీ పుస్తక రచయితగా కూడా శిల్పాశెట్టి బాగానే పాపులర్ అయినట్లు కనిపిస్తోంది.