ఎందరికో ఆదర్శం వేమన
- ఆలోచింపజేసిన కళాజాత
- ప్రారంభమైన వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సు
అనంతపురం కల్చరల్ : ప్రజాకవి వేమన ఎందరికో ఆదర్శమని ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు తెల్కపల్లి రవి, రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, ఆచార్య గోపి, డీఎస్పీ మల్లికార్జునవర్మ అన్నారు. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు పేరిట అనంత వేదికగా రెండురోజుల పాటు సాగే ఉత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక మునిసిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేమన సదస్సు ఆహ్వాన కమిటీ కార్యదర్శి కుమారస్వామి అధ్యక్షత వహించారు. తెల్కపల్లి రవి, రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, ఆచార్య గోపి, డీఎస్పీ మల్లికార్జునవర్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వేమన స్ఫూర్తిదాయక జీవితం గురించి మాట్లాడారు. ఆటవెలది పద్యాలతో జీవిత సత్యాలను వేమన తెలియజేశారని గుర్తుచేశారు. నాడు సమాజంలో నెలకొన్న మూఢాచారాలు, కులతత్వాన్ని నిరసించి మహాకవులకు వేమన ఆదర్శప్రాయంగా నిలిచాడని కొనియాడారు.
ఆకట్టుకున్న కళారూపాలు
అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులు రూపొందించిన కళాజాత ఆహూతులను ఉర్రూతలూగించింది. రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసిన ప్రజా నాట్యమండలి కళాకారులు వేమన సాహిత్య ప్రాధాన్యం తెలిపే నృత్యరూపకాలను అద్భుతంగా ప్రదర్శించారు. వేమన సాహిత్యాన్ని దృశ్యరూపకాలతో అనుసంధానం చేస్తూ చైతన్యవంతం చేయడమే లక్ష్యమని కళాబృందాలకు నేతృత్వం వహించిన ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు బాషా అన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుసంధానంగా మధ్యయుగం నాటి సమాజ వ్యవస్థను పోలుస్తూ సాగిన రూపకం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, జట్టీ జైరామ్, సదస్సు జిల్లా నిర్వాహకులు రవిచంద్ర, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.