థార్మిక భావనల సంకలనం రామాభ్యుదయం
ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట
సంస్కృతాంధ్రపండితుడు కందుకూరి
ముగిసిన భువన విజయం సాహితీ ప్రసంగాలు
రాజమహేంద్రవరం కల్చరల్ :
అయ్యలరాజు రామభద్రుడు రాసిన ‘రామాభ్యుద యం’ లోకానికి థార్మిక భావనలు అందించిన మహాకావ్యమని సంస్కృతాంధ్రపండితుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ తెలిపారు. తెలుగు భాషలో లెక్కలేనన్ని రామాయణాలు వచ్చినప్పటికీ వీటిలో ప్రామాణికంగా చెప్పుకోదగ్గది విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షమొక్కటేనని చెప్పారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన భువన విజయం సాహితీ ప్రసంగాల ముగింపు సభలో ‘రామాభ్యుదయము–వత్సలత’ అంశంపై ఆయన ప్రసంగించారు. రా మాయణం కరుణ రస ప్రధానమైన కావ్యమన్నారు. మొల్ల రామాయణం, అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము శృంగార రస ప్రధానమైనవన్నారు. ఆదర్శవంత మైన పరిపాలనను అందించిన ఏకైక చక్రవర్తి శ్రీరామచంద్రు డు, ఆయనలో కించిత్తు దోషం లేదు, రామాయణాన్ని అర్థం చేసుకోకపోతే అది మనలోని లోపమేనని ఆయన తెలిపారు.
కావ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి
ఆడపెళ్లివారు తక్కువ, మగ పెళ్లివారు ఎక్కువ అనే భావన తప్పని రామాయణం చదివినవారికి అర్థమవుతుందని చెప్పారు. బాలకాండలో దశరథుడు జనకునితో ‘కన్యాదానం స్వీకరించే నా చేయి కిందనే, కన్యాదానం చేసే మీ చేయిపైనే’ అంటాడని తెలిపారు. ఏదైనా కావ్యం చదివితే చాలదు, కవి లోతయిన భావ బలాన్ని మనం అందుకోగలగాలని సూచించారు. సాహిత్యాన్ని గురించి ఆలోచనలు చేస్తుంటే, లోతయిన అర్థాలు గోచరిస్తాయన్నారు. వసుచరిత్ర, మనుచర్రితల్లో తెలుగువారి సంప్రదాయాలను అం తగా ఆయా కవులు వివరించలేదు, కానీ రామాభ్యుదయం లో తెలుగువారి ఆచార సంప్రదాయాలను అయ్యలరాజు రామభద్రుడు చక్కగా వర్ణించాడని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరా వు మాట్లాడుతూ మన ప్రాచీన కావ్యాలు, పురాణాలు అన్నీ మన చరిత్రలేనని తెలిపారు. తెలుగు పండితుడు ఓలేటి బంగారేశ్వర శర్మ స్వాగత వచనాలు పలికారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, పద్యసారస్వత పరి షత్ జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు చింతలపాటి శర్మ మాట్లాడుతూ భువన విజయం సాహితీ ప్రసంగాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో సాహితీ అభిమానులు హాజరయ్యారు.