ఉద్యమబాటలో రచయితలు
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కు ఇచ్చేసిన రచయితలు మరో ముందడుగు వేశారు. వారు మత అసహనంపై ఉద్యమ బాట పట్టారు. దేశంలో రచయితలు, సామాజిక ఉద్యమకారులు, మేధావులపై జరుగుతున్న హత్యాకాండలు, బీఫ్ వివాదంలో ఓ వ్యక్తిని హత్య చేయడంవంటి ఘటనలపట్ల వారు పలువురు రచయితలు, కళాకారులతో కలసి ఢిల్లీ నడి వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు.
శుక్రవారం వారంతా చేతిలో ప్లకార్డులు, నోటికి నల్లరంగు గుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శనతో ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ.. దానిని నిలువరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యాయం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలిపారు. ఇప్పటి వరకు 40 మంది తమకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చి వేసిన విషయం తెలిసిందే. ఎంఎం కాల్చుర్గి, హేతువాది నరేంద్ర దాబోల్కర్, గోవింద్ పన్సారే వంటి ప్రముఖులు, బీఫ్ వివాదంలో ఉత్తరప్రదేశ్ లో ఓ ముస్లిం వ్యక్తిని హత్య చేయడంపట్ల నిరసన వ్యక్తం చేస్తూ వారు శుక్రవారం ఈ మౌన ప్రదర్శన చేపట్టారు.