31 రాత్రంతా సాయి దర్శనం
సాక్షి, ముంబై: పుణ్యక్షేత్రం షిర్డీలో ఈ నెల 31న శ్రీ సాయిబాబా సమాధి మందిరం రాత్రంతా తెరిచి ఉండనుంది. క్రిస్మస్ సేవలు, అలాగే సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీకి తరలివచ్చే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే తెలిపారు. ఈ సందర్భంగా మందిరం వద్ద వేర్వేరు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ వేడుకల సమయంలో సాయి పల్లకీతో కాలి నడకన పాదయాత్ర చేసి వచ్చిన భక్తులు కూడా సామాన్య దర్శ నం నుంచే బాబాను దర్శించుకోవల్సి ఉంటుందని తెలిపారు. పాదయాత్రికులు బస చేయడం కోసం పలుచోట్ల మండపాలు, అదనంగా నివాస, ప్రసాద భోజన ఏర్పాటు చేస్తామన్నారు. ‘డిసెంబర్ 31న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ముంబైకి చెందిన సచ్చిదానంద ఆప్పాచే హిందీ, మరాఠీ భక్తి సంగీత కార్యక్రమం ఉంటుం ది. రాత్రి 8.45 నుంచి 10.15 గంటల వరకు పార స్ జైన్, ప్రవీణ్ మహాముని, జిమ్మీ శర్మాల సాయిభజన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత 10.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఠాణేకు చెందిన జగదీశ్ పాటిల్చే భజన కార్యక్రమం జరుగుతుం ద’ని అజయ్ మోరే తెలిపారు. డిసెంబర్ 31న శేజారతి, జనవరి ఒకటిన కాకడ హారతి ఉంటుందన్నారు. మందిరం పరిసర ప్రాంతాల్లో టపాసులు, వాయిద్యాల చప్పుడు చేయరాదని తెలిపారు. భద్రతా దృష్ట్యా భక్తులు సంస్థాన్ సూచనలను పాటించాలని ఆయన కోరారు.
వీఐపీ పాస్‌ల నిలిపివేత
షిర్డీలో సాయిబాబా దర్శనం కోసం ఇవ్వబడే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటి తేదీల్లో నిలిపివేయనున్నారు. క్రిస్మస్, సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం సెలవులను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో షిర్డీకి వస్తారు. ఈ నేపథ్యంలో అతి ముఖ్యమైన వ్యక్తులకు జారీ చేసే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటిన రద్దు చేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.