3D థ్రిల్
శ్రీకారం చుట్టుకున్న పెళ్లి పుస్తకానికి.. అందమైన ఆకారం ఇచ్చేది ఫొటో ఆల్బమ్సే. అందుకే పెళ్లి వేడుకలో వధూవరుల దృష్టంతా ఫొటోలపైనే ఉంటుంది. ఒకరినొకరు కలుసుకున్న సుముహూర్తాన్ని జీవితాంతం తరచి తరచి చూసుకుని మురిసిపోతుంటారు. ఈ అనుభూతికి మూడింతల ఆనందాన్ని జత చేస్తున్నాయి త్రీడీ ఫోటోలు. జీలకర్రబెల్లంతో చూపులు కలిసిన సుందర దృశ్యాన్ని మళ్లీ అంతే అందంగా కళ్లముందు ఉంచుతున్నాయి ఈ త్రీడీ ఛాయా చిత్రాలు. మూడు ముళ్లు వేసినపుడు వెలిగిన ఆనందాన్ని.. సప్తపదులు మెట్టినపుడు కలిగిన అనుభూతిని.. ఏమాత్రం మిస్ కాకుండా అదే కోణంలో ఆవిష్కృతం చేస్తున్నాయి.
..:: విజయారెడ్డి
మామూలు సినిమాల కంటే 3డీ మూవీలు చూస్తే మజా ఎక్కువగా ఉంటుంది. 2డీ గేమ్స్‌లో కన్నా.. త్రీడీ ఆటల్లో ఎక్కువగా లీనమైపోతాం. అందుకే మూడు ముళ్ల బంధాన్ని మరింత పసందుగా చూపించడానికి పెళ్లి ఫొటోలు కూడా ఇప్పుడు 3డీలో వచ్చేస్తున్నాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి ఊరంతా చెప్పుకుని మురిసిపోయేలా జరిగిన పెళ్లి వైభోగాన్ని.. అంతే ఫ్రెష్‌గా చిరకాలం ఉంచుతున్నాయి ఈ 3డీ ఛాయాచిత్రాలు. అందుకే నాలుగు కాలాలు నిలిచిపోయే వివాహ బంధాన్ని మూడు కోణాల్లో చూసుకుంటే ఆ థ్రిల్లే వేరని మురిసిపోతున్నారు నగరవాసులు.
జంట కెమెరాలతో..
స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చిన తర్వాత ఫొటోలు తీయడం సులభం అయిపోయింది. డిజిటల్ కెమెరాల్లో క్షణకాలంలో పదుల సంఖ్యలో ఫొటోలు తీసేస్తున్నారు. కానీ త్రీడీ ఫొటోలు తీయాలంటే అంత ఈజీకాదు. త్రీడీ ఫొటోలను, వీడియోలను తీయాలంటే ప్రత్యేకమైన జంట కెమెరాలు వాడాల్సి ఉంటుంది. ఫొటోల విషయానికి వస్తే రెండు స్నాప్ షాట్స్ ఒకేసారి తీస్తారు. పెళ్లిలో బంధుమిత్రుల హడావుడి అంతాఇంతా కాదు. ఎవరి లోకంలో వాళ్లుంటారు. ఫొటోగ్రాఫర్లను పట్టించుకునే వారే ఉండరు. కానీ మీ పెళ్లి ఫొటోలు 3డీలో కావాలంటే మాత్రం.. మీరు ఫొటోగ్రాఫర్లకు పూర్తిగా సహకరించాల్సిందే. వివాహ వేదికలో త్రీడీ కెమెరాల సెటప్ చేయాలంటేనే కనీసం 5 గంటల సమయం పడుతుంది. ముందుగా ట్రయల్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఓకే అయితేనే వాళ్ల పని మొదలవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా తీసిన ఫొటోలన్నీ వృథా అయిపోతాయి.
మూడుముళ్ల ముచ్చట..
జీవితంలో జరిగే అపురూప వేడుక పెళ్లి. అందుకే ఈతరం పెళ్లిని ఖర్చుకు వెరవకుండా వీలైనంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శుభలేక నుంచి రిటర్న్ గిఫ్ట్‌ల వరకూ ఎందులోనూ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. ఇలా తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని ముచ్చట పడుతున్న వారు ఆ సంబరాన్ని అంతే ఆర్భాటంగా చిత్రీకరించుకోవాలని ఆరాటపడుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా త్రీడీ ఫొటోలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక బడ్జెట్ అంటారా..! మామూలుగా పెళ్లి ఫొటోలకు, వీడియోలకు రూ.10 వేల నుంచి ప్యాకేజీలు ఉన్నాయి. త్రీడీ చిత్రీకరణకు వస్తే లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకూ ఉన్నాయి. త్రీడీ ఫొటోల ఆల్బమ్, వీడియోలతో పాటు 2డీ ఫొటోల అల్బమ్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు 3డీ చిత్రాలను కన్నులారా వీక్షించేందుకు కావాల్సిన కళ్లజోళ్లను కూడా ప్యాకేజీలో భాగంగానే అందజేస్తున్నారు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు.
ఆ తరానికీ ఈ భాగ్యం..
ఈ తరం తమ పెళ్లిని 3డీలో చూసుకుంటూ మురిసిపోతుంటే.. ఇలాంటివి మా జమానాలో ఉంటే బాగుండనుకునే ఆ తరం వాళ్లూ ఎందరో !. అలాంటి వారికీ త్రీడీ భాగ్యం కల్పిస్తున్నారు ప్రొఫెషనల్స్. పాత 2డీ ఫొటోలను 3డీలోకి మార్చుకునే సౌకర్యం కూడా ఉందంటున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులు భవిష్యత్తులో 3డీ ఫొటో కాస్ట్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఒక్క పెళ్లి వేడుకే కాదు.. పెళ్లి రోజు, పుట్టిన రోజు, గృహప్రవేశం.. ఇలాంటి శుభకార్యాలకు 3డీ సొబగులు అద్దుకోవచ్చు.
3డీ డిమాండ్
నగరంలో ఈ మధ్య కాలంలో 3డీ ఫోటోలు తీయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. పాత ఫొటోలను 3డీలోకి మార్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ 3డీ ఫొటోలు చూసినప్పుడల్లా పెళ్లి నాటి సంతోషం కళ్లముందుకొస్తుంది. ఈ మేరకు నగరంలో 3డీ స్టూడియోల సంఖ్య కూడా పెరిగింది. ఫ్యూచర్లో ఇందులో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి.
- సాయి చౌదరి