సాయి కృష్ణ-పవన్ జంటకు టైటిల్
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-17 బాలుర డబుల్స్ విభాగంలో సాయి కృష్ణ పొదిలి (తెలంగాణ)-కర్రి సాయి పవన్ (ఏపీ) జోడి విజేతగా నిలిచింది. తిరుపతిలో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఫైన ల్లో సాయి కృష్ణ-సాయి పవన్ ద్వయం 19-21, 21-14, 21-10తో ఖదీర్ మొయినుద్దీన్-విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంటపై విజయం సాధిం చి టైటిల్‌ను కై వసం చేసుకుంది.
అండర్-17 బాలికల డబుల్స్ ఫైనల్లో సామియా ఫరూఖి-పుల్లెల గాయత్రి (తెలంగాణ) జోడి 19-21, 17-21తో అశ్విని భట్- మిథులా (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ప్రాశి జోషి రన్నరప్‌గా నిలిచింది. ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాశి జోషి ఫైనల్లో 19-21, 14-21తో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయింది.
బాలుర ఫైనల్స్‌లో కార్తికేయ గుల్షాన్ (ఎయిరిండియా) 21-15, 19-21, 21-13తో మైస్నమ్ (మణిపూర్)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. అండర్-19 బాలుర సింగిల్స్ విభాగంలో ఎయిరిండియాకు ఆడిన తెలుగు ప్లేయర్ ఎం.కనిష్క్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో కనిష్క్ 15-21, 15-21తో లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) 17-21, 21-7, 21-13తో శిఖా (కర్ణాటక)ను ఓడించింది. అండర్-19 బాలుర డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)-ధ్రువ్ జంట 21-13, 21-12తో గౌస్ షేక్- బషీర్ సయ్యద్ (ఏపీ) జంటపై నెగ్గింది. బాలికల డబుల్స్ ఫైనల్లో మహిమ- శిఖా గౌతమ్ (పీఎన్బీ) జంట 18-21, 21-15, 21-17తో అశ్విని- మిథులా (కర్ణాటక) జోడిపై నెగ్గింది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)- మహిమ (కర్ణాటక) జోడి 21-16, 21-14తో ధ్రువ్- కుహు గార్గ్ (ఉత్తరాఖండ్)పై గెలిచింది.