‘సర్కిల్’మూవీ రివ్యూ
టైటిల్: సర్కిల్
నటీనటులు: సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా తదితరులు
నిర్మాణ సంస్థ: ఆరా ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎమ్వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ
దర్శకత్వం: నీలకంఠ
సంగీతం: ఎస్ఎస్ ప్రశు
సినిమాటోగ్రఫీ: రంగనాత్ గోగినేని
విడుదల తేది: జులై 7, 2023
కథేంటంటే..
కైలాష్ (సాయి రోనక్) ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్. కానీ ఓ కారణంగా మద్యానికి బానిసవుతాడు. ఓ రోజు బాగా తాగి ఇంట్లోకి వెళ్లగా, కిరాయి హంతకుడు పొత్తూరి గణేష్(బాబా భాస్కర్) అతనిపై దాడి చేస్తాడు. కైలాష్ని చైర్‌కి కట్టేసి.. బ్రహ్మ ముహూర్తం వచ్చే వరకు చంపనని, ఆలోపు తనను చంపేందుకు ఎవరు సుపారి ఇచ్చారో గెస్ చేస్తే అతనితో ఫోన్లో మాట్లాడించడంతో పాటు కుదురితే వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. దీంతో కైలాష్ గెస్ చేసేందుకు ట్రై చేస్తాడు. మొదట తన మాజీ ప్రియురాలు అరుంధతి(రిచా పనాయ్) పేరు చెబుతాడు. ఆమెలో ప్రేమాయణం..బ్రేకప్‌కి గల కారణాలు చెబుతాడు. అయితే తనకు సుపారీ ఇచ్చింది అరుంధతి కాదని అంటాడు పొత్తూరి గణేష్. దీంతో ఎంపీ కూతురు మాళవిక(అర్షిత్ మెహతా), యువరాణి హిమాని రాజ్‌పుత్(నైనా)ల లవ్‌స్టోరీలు రివీల్ చేస్తాడు. ఈ ముగ్గురి ప్రేమకథలు ఏంటి? అసలు కైలాష్ ఈ ముగ్గురితో ఎందుకు విడిపోయాడు? కైలాష్ని చంపేందుకు పొత్తూరి గణేష్‌కి సూపారీ ఇచ్చిందెవరు? అనేది తెలియాలంటే థియేటర్లో ‘సర్కిల్’ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
వైవిధ్యమైన చిత్రాల రూపకర్తగా పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది దర్శకుడు నీలకంఠ ఒక్కరు. ఆయన సినిమాల్లో కంటంటే హీరో. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా.. ఆయన దర్శకత్వ ప్రతిభపై మాత్రం విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆయన తెరకెక్కించిన `షో` చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి గొప్ప డైరెక్టర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు పెంచుకోవడం సర్వసాధారణం.
గత సినిమాల మాదిరే ‘సర్కిల్’కూడా డిఫరెంట్‌గా ఉంటుందని అంతా ఆశించారు. కానీ నీలకంఠ మాత్రం ఓ రొటీన్ పాయింట్‌తో ‘సర్కిల్’ని తెరకెక్కించాడు. పాత కథే అయినా తనదైన శైలీ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ప్రాణం విలువ తెలియజేసే సందేశాత్మక చిత్రమిది. దానికి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసి యూత్‌ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమాలో మొత్తం మూడు ప్రేమ కథలు ఉంటాయి. అవన్నీ రోటీన్‌గా ఉన్నప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం యూత్‌ని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో అసలు కైలాష్ని చంపేందుకు సూపారీ ఇచ్చిందెవరనేది చివరకు వరకు తెలియకపోవడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఫస్టాఫ్‌లో కిల్లర్, హీరో మధ్య ఆసక్తికరమైన సంభాషణ, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో మొత్తం మళ్లీ రొటీన్ లవ్‌స్టోరీతోనే నడవడం మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడితే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఫోటోగ్రాఫర్ కైలాష్ పాత్రలో సాయి రోనాక్ ఒదిగిపోయాడు. ఇలాంటి లవర్‌బాయ్ తరహా పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. సుపారీ కిల్లర్‌గా బాబా భాస్కర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. . హీరోయిన్లుగా నటించిన రిచా పనయ్, అర్షితా మెహతా, నైనా ముగ్గురూ చాలా చక్కగా నటించారు. తెరపై అందంగా కనిపించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఎస్ఎస్ ప్రశు సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా, వినసొంపుగా ఉన్నాయి. రంగనాత్ గోగినేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా నిర్మాణ విషయంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీ పడలేదు. చిన్న సినిమా అయినా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది.