స్నేహితుని ఇంట్లో చోరీ... ఓఎల్ఎక్స్లో విక్రయం
ఇద్దరి అరెస్టు
లంగర్‌హౌస్: స్నేహితుడి ఇంట్లో వస్తువులు చోరీ చేసి.. వాటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తున్న ఇద్దరి లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... సాయిశ్రీకాంత్ లంగర్‌హౌస్ దుర్గానగర్‌లో ఉంటూ అమేజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐటీ చేసిన ఇతను గతనెల 7న యూనివర్సిటీలో పట్టా అందుకొనేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. 16న నగరానికి తిరిగి వచ్చే సరికి దొంగలు కిటికీలోంచి చొరబడి కంప్యూటర్, ట్యాప్ తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... చోరీ అయిన వస్తువుల్లో సామ్సంగ్ ట్యాబ్ ఓఎల్ఎక్స్లో రూ. 6 వేలకు విక్రయించినట్టు కనుగొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా సాయి స్నేహితులే ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది.
గతంలో ఇదే అపార్ట్మెంట్లో ఉండి ప్రస్తుతం భెల్ ఎంప్లాయ్ అసోసియేట్‌లో పని చేస్తున్న ఉప్పర్‌పల్లికి చెందిన శ్రీకాంత్, లంగర్‌హౌస్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్న రాంపల్లి విక్రమ్‌తో కలిసి చోరీ చేసినట్టు గుర్తించి సోమవారం ఇద్దరినీ అరెస్టుచేశారు. వీరి వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, మానీటర్, సెల్‌ఫోన్, సామ్సంగ్ ట్యాబ్, 2 గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుల్లో శ్రీకాంత్ పాతనేరస్తుడని పోలీసులు తెలిపారు.