అంకుల్.. మీ వల్లే నేను బతికాను..
నివాళులర్పించిన సాయివర్షిణి
అర్వపల్లి: వైఎస్సార్ అంకుల్.. మీవల్లే నేను బతికాను.. అంటూ ఓ విద్యార్థిని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలంలోని పర్సాయపల్లిలో శుక్రవారం వైఎస్సార్ వర్ధంతిని నిర్వహిస్తుండగా.. 9వ తరగతి చదువుతున్న జెట్టి సైదులు కుమార్తె సాయివర్షిణి (13) అక్కడకు వచ్చి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది.
తనకు ఐదేళ్ల కిందట గుండెజబ్బు రాగా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్నానని.. వైఎస్సార్ అంకుల్ ప్రవేశపెట్టిన పథకం వల్లే తాను బతికానని చెప్పింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా వైఎస్సార్‌ను గుర్తు చేసుకొని, కంటతడిపెట్టి ఆమెను అక్కున చేర్చుకున్నారు.