ప్రగతిపై ప్రచారం!
సాక్షి, చెన్నై: కార్పొరేషన్ సంక్షేమ పథకాలు, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బస్టాపుల్ని వేదికగా చేసుకుని ప్రచార బోర్డుల ఏర్పాటుకు చెన్నై కార్పొరేషన్ పాలక మండలి నిర్ణయించింది. స్వైన్‌ఫ్లూ అదుపులో ఉందంటూ మేయర్ సైదైదురై స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
చెన్నై మహానగర కార్పొరేషన్ పాలక మండలి సమావేశం శుక్రవారం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ సైదైదురై స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ విక్రమ్ కపూర్, డెప్యూటీ మేయర్ బెంజమిన్‌లు నేతృత్వం వహించారు. సభ ఆరంభం కాగానే, శ్రీరంగం ఉప ఎన్నికల గెలుపు భజనను అందుకున్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపునకు అభినందనలు తెలియజేస్తూ , తమ అమ్మ జయలలితను పొగడ్తలతో ముంచెత్తారు. ఇందుకు గాను ప్రత్యేక తీర్మానం కూడా చేశారు. అనంతరం నగరంలో దోమల మోత, స్వైన్ ఫ్లూ నివారణ చర్యలను వివరిస్తూ మేయర్ సైదైదురై స్వామి ప్రసంగించారు. నగరంలో 77 కేసులు నమోదయ్యాయని, 37 మంది సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారని వివరించారు. మిగిలిన వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు.
ఒకరు మాత్రం మరణించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కట్టడిలో ఉందని, ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలు వేగవంతం చేసి, ఆ జ్వరం కట్టడికి కార్పొరేషన్ విస్తృత చర్యలు తీసుకుందని డప్పులు వాయించుకుంటూ వ్యాఖ్యలు చేశారు. దోమల్ని పూర్తిగా అదుపు చేశామని, స్వైన్ ఫ్లూ ఇక లేనట్టే అన్నట్టుగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రతి పక్ష నేత డీఎంకే సభ్యుడు సుభాష్‌చంద్ర బోస్ తీవ్ర ఆక్షేపనల్ని వ్యక్తం చేశారు.
డీఎంకే వాకౌట్: ప్రతి పక్షనేత సుభాష్ చంద్రబోస్‌తో పాటుగా డీఎంకే సభ్యులు జోషఫ్ శ్యాముల్, కాళి ముత్తు, తదితరులు మేయర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అన్నీ తప్పుడు సమాచారాలు ఇస్తున్నారని, ఆయన వ్యాఖ్యల్లో ఒక్క నిజం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఇస్తే కార్పొరేషన్ వ్యవహరించిన తీరును ఆధారాలతో సహా ముందు ఉంచుతామని హెచ్చరించారు. వారి హెచ్చరికల్ని, నినాదాల్ని మేయర్ ఖాతరు చేయకుండా, తన ప్రసంగాన్ని ముందుకు సాగించారు. ఆగ్రహించిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభలో కార్పొరేషన్ నేతృత్వంలో చేపట్టనున్న అనేక అభివృద్ధికార్యక్రమాల్ని వివరిస్తూ పలు తీర్మానాలను మేయర్ సైదైదురై స్వామి ప్రవేశ పెట్టారు.
ఓ సభ్యుడు వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని మేయర్ ప్రకటించారు.