అటవీభూముల్లో తవ్వకాలపై విజిలెన్స్ విచారణ
సైదాపురం: అటవీ భూముల్లో మట్టి తవ్వకాలపై విజిలెన్స్ డీఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి విచారణ చేపట్టారు. షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు తారురోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ అటవీ అధికారుల అనుమతి లేకుండానే అడవిలో 900 మీటర్ల మేర మట్టిని తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీనివాసులునాయుడు అనే వ్యక్తి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొలకలపూండ్ల అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సైదాపురం పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించారని సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు రాతపూర్వకంగా తెలిపారు. రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రావెల్ తవ్విన 900 మీటర్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందన్నారు. ఈ విషయమై అధికారులు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపితే అనుమతులు వస్తాయన్నారు. అప్పటి వరకు పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట నెల్లూరు, వెంకటగిరి రేంజర్లు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌రెడ్డి, విజిలెన్స్ రేంజర్ సుబ్బారెడ్డి తదితరులున్నారు.