రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాప్తాడు : మండల కేంద్రంలోని ప్రసన్నాయపల్లి రోడ్డు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాప్తాడుకు చెందిన సాకే శివప్రసాద్ (30) ఓ దినపత్రికను ప్రతి రోజూ నార్పల రూటుకు ఆటోలో తీసుకెళ్లేవాడు. దినచర్యలో భాగంగా బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి ఆటోలో దినపత్రిక కార్యాలయానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డాల్ఫిన్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 ద్వారా రాప్తాడు పోలీసులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఏడాది కిందట అతడి భార్య విద్యుదాఘాతంతో మృతి చెందింది. అతడికి ఒక కూతురు ఉంది. ఎస్ఐ ధరణిబాబు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.