సఖినేటిపల్లి రేవును సందర్శించిన డ్రెడ్జింగ్ శాఖ అధికారులు
సఖినేటిపల్లి : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రాజేష్ త్రిపాఠి, కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సఖినేటిపల్లిరేవును బుధవారం సందర్శించారు. అంతర్వేదికరలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం దాదాపు ఖరారైన నేపద్యంలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి డ్రెడ్జింగ్‌కు సంబంధించిన భారీ వాహనాలు అంతర్వేదికరకు చేరుకోవడానికి వీలుగా మెరుగైన రహదారి నిమిత్తం ఈ పరిశీలన వారు చేశారు. ఇందుకు గోదావరి నదిపై వంతెన నిర్మాణ ప్రతిపాదనకు వారు తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అంతర్వేది శ్రీలక్ష్మినృసింహస్వామిని వారు దర్శించుకున్నారు. ఆలయంలోని కార్యాలయంలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు గతంలో కేటాయించిన స్థలం మ్యాప్‌ను సర్వే నంబర్లు ఆధారంగా తహసీల్దారు సుధాకర్‌రాజు, సర్వేయర్ రాజుతో డ్రెడ్జింగ్ శాఖ ఉన్నతాధికారులు త్రిపాఠి, శాస్త్రి చర్చించారు. కేటాయించిన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హార్బర్‌కు మొత్తం 238 ఎకరాలు కేటాయించినట్లు తహసీల్దారు చెప్పారు. ఇదిలా ఉండగా తొలివిడతగా హార్బర్ నిమిత్తం పిలిచిన రూ.838 కోట్ల టెండరు ఖరారు దశకు చేరుకున్నట్లు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు. దీనికి జనవరిలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ధవళేశ్వరం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు, సర్పంచ్‌లు పోతురాజు నాగేంద్రకుమార్, చొప్పల చిట్టిబాబు, వీఆర్వో పోతురాజు బాబు, ప్రముఖులు ఉన్నారు