ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
సేలం: భర్తను ప్రియుడితో కలసి హతమార్చి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాతి పెట్టిన ఓ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం అమ్మా పాళయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం అమ్మాపాళయంకు చెందిన బాలకృష్ణన్(45) స్థానికంగా సెలూన్ షాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుందరి(35). వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతంలోని రాజేంద్రన్ ఇంట్లో కుటుంబంతో కలసి బాలకృష్ణన్ అద్దెకు ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్‌లో బాలకృష్ణన్ అదృశ్యం అయ్యాడు.
బాలకృష్ణన్ అదృశ్య మిస్టరీని ఛేదించేందుకు సూర మంగళం పోలీసులు రంగంలోకి దిగారు. సేలం పోలీసు కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ మురుగేషన్ విచారణ వేగవంతం చేశారు.
భర్తను కడతేర్చి: పోలీసు రహస్య విచారణలో బాలకృష్ణన్ ఇంట్లోకి తరచూ ఇంటి ఓనర్ రాజేంద్రన్ తనయుడు లోకనాథన్(27) వెళ్లి వస్తుండడం వెలుగులోకి వచ్చింది. లోకనాథన్, బాలకృష్ణన్ భార్య సుందరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టు అయింది. లోకనాథన్, సుందరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసి బాలకృష్ణన్ ఇద్దరిని మందలించాడు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుండడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు బాలకృష్ణన్‌ను హతమార్చేందుకు పథకం వేశారు. గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ ఇంట్లో మద్యం మత్తులో బాలకృష్ణన్ ఉండడాన్ని గుర్తించి పథకం అమలుకు నిర్ణయించారు. తన స్నేహితులు కుమార్ (24), రేవన్(25)తో కలసి ఆ ఇంట్లోకి లోకనాథన్ చొరబడ్డారు. ఈ ముగ్గురు, సుందరి కలిసి కత్తులతో బాలకృష్ణన్‌ను పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయడం కష్టతరం కావడంతో, దానిని ముక్కలు మక్కలుగా కోశారు. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎవరి దారిన వారు అన్నట్టుగా ఉండి పోయారు.
మరుసటి రోజు ఆ ముక్కల్ని తీసుకెళ్లి ఓ శ్మశానంలో నాలుగైదు చోట్ల పూడ్చి పెట్టారు. వీరి వివాహేతర గుట్టు, హత్య బండారం బయట పడడంతో ఆ పరిసర వాసులు షాక్‌కు గురి అయ్యారు. ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహం ముక్కలు పాతి పెట్టిన ప్రాంతాల్లో తవ్వకాల్లో పడ్డారు. కేసు నమోదు చేసిన ఆ నలుగుర్ని కటకటాల్లోకి నెట్టారు. తన సుఖం కోసం వివాహేతర సంబంధం భర్తను కడతేర్చి సుందరి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథగా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.