ఫైనాన్షియల్ బేసిక్స్..
ఈఎల్ఎస్ఎస్
మ్యూచువల్ ఫండ్..
ఇన్వెస్టర్లు పరిశోధన, విశ్లేషణ వంటి అంశాలతో అవసరం లేకుండా వారి పెట్టుబడులకు ప్రతిఫలాన్ని పొందటానికి మ్యూచువల్ ఫండ్స్ దోహదపడతాయి. అధిక సంఖ్యాక ఇన్వెస్టర్లు చేసే ఇన్వెస్ట్మెంట్లను వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టడమే ఈ మ్యూచువల్ ఫండ్స్ పని. ఇక్కడ ఇన్వెస్టర్లు వారి డబ్బును వేటిల్లో, ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. మ్యూచువల్ ఫండ్స్ వాటి ఫండ్స్ నిర్వహణ కోసం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి వివిధ ఇన్వెస్టర్లకు అనువుగా ఉండే పలు రకాల ఫండ్ పథకాలను మార్కెట్లోకి తెస్తాయి. వాటిల్లో మనకు అనువైన వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి.
ఎక్కడ ఇన్వెస్ట్చేయాలో తెలియని వారు, పెట్టుబడులకు అధిక సమయం కేటాయించలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. చాలా ఫండ్స్‌లో రూ.500 నుంచి ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించొచ్చు. అలాగే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కన్నా ఫండ్స్‌లో లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. అంటే మనకు అవసరమైనప్పుడు మన డబ్బుల్ని ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరగా వెనక్కు తీసుకోవచ్చు.
ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌నే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)గా పరిగణిస్తారు. ఇవి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. అంటే అటు లార్జ్ క్యాప్‌తోపాటు ఇటు మిడ్ క్యాప్‌లోనూ మన డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లకు 80 సీ కింద పన్ను రాయితీలను పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1 లక్ష వరకు పన్ను ప్రోత్సాహకం అందుబాటులో ఉంది. వీటిల్లో పెట్టుబడులను మూడేళ్ల తర్వాతే వెనక్కు తీసుకోగలం. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించే వారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉత్తమం.