కుబేరుల ఖిల్లా.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పరంగా భారత్ అయిదోస్థానాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మొత్తం 70 మంది బిలియనీర్లు లెక్కతేలారు. చైనాకు చెందిన రీసెర్చ్ సంస్థ హురున్... ప్రపంచ సంపన్నుల జాబితా-2014లో ఈ వివరాలను వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే ఈసారి కూడా భారత్‌లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. ఆయన వ్యక్తిగత సంపద 18 బిలియన్ డాలర్లు(దాదాపు 1.12 లక్షల కోట్లు)గా అంచనా. కాగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 41వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్ వన్ స్థానం బిల్‌గేట్స్‌కు దక్కింది. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.22 లక్షల కోట్లు).
భారత్‌లో జోరు...
ప్రపంచ టాప్ బిలియనీర్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నవారిలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 49 ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీలు సంయుక్తంగా 77వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి సంపద చెరో 13.5 బిలియన్ డాలర్లుగా అంచనా. కాగా, టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ(12 బిలియన్ డాలర్లు), హిందూజా గ్రూప్‌నకు చెందిన ఎస్పీ హిందుజా కుటుంబం(12 బిలియన్ డాలర్లు) కూడా 93 ర్యాంక్‌లో ఉన్నారు.
గడిచిన ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగా క్షీణించడంతో బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో భారతీయులు కొంత వెనుకబడటానికి కారణమైందని హురున్ పేర్కొంది. అయినప్పటికీ.. 2013తో పోలిస్తే 17 మంది కుబేరులు పెరిగినట్లు వెల్లడించింది. జర్మనీ, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ల కంటే భారత్‌లోనే బిలియనీర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, మొత్తం 70 మంది భారతీయ కుబేరుల సంపద విలువ 390 బిలియన్ డాలర్లుగా అంచనా.
హురున్ జాబితాలో ఇతర ముఖ్యాంశాలివీ...
గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హ్యాత్వే అధిపతి వారెన్ బఫెట్ 64 బిలియన్ డాలర్ల సంపదతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
స్పెయిన్‌కు చెందిన ఇండిటెక్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అమన్షియో ఒర్టెగా 3వ ర్యాంక్‌లో నిలిచారు. ఆయన సంపద 62 బిలియన్ డాలర్లు.
నాలుగో స్థానంలో మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ కుటుంబం(60 బిలియన్ డాలర్లు), ఐదో ర్యాంక్‌లో ఒరాకిల్ సీఈఓ లారీ ఎలిసన్(60 బిలియన్ డాలర్లు) నిలిచారు.
కుబేరుల సంఖ్య పరంగా 481 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా(358 మంది బిలియనీర్లు) నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో సగం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు.
ముంబైలో 33 మంది బిలియనీర్లు ఉన్నారు. అత్యధిక సంపన్నులున్న ప్రపంచ నగరాల్లో ఆరో స్థానం.
న్యూయార్క్ నగరం 84 మంది కుబేరులతో ప్రపంచ బిలియనీర్ల రాజధానిగా నంబర్ వన్ ర్యాం క్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఈ సంఖ్య 70.
అమెరికా డాలర్లలో సంపదను లెక్కించారు. ఈ ఏడాది జనవరి 17 నాటి గణాంకాల ఆధారంగా జాబితాను రూపొందించారు.
మొత్తం ఈ సూపర్ రిచ్ లిస్ట్‌లో 68 దేశాల నుంచి 1,867 మంది బిలియనీర్లు లెక్కతేలారు. వీళ్ల మొత్తం సంపద కళ్లు చెదిరేరీతిలో 6.9 లక్షల కోట్లు.
ఈ ఏడాది లిస్ట్‌లో ప్రతి 9 మందిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. 2013లో ప్రతి పది మందిలో ఒక మహిళా బిలియనీర్ ఉన్నారు.