నోట్ల రద్దైనా మారుతీ, హ్యుందాయ్‌లు....
పాత నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో డిమాండ్ సన్నగిల్లి తెగ ఆందోళన చెందుతుంటే, రెండు అతిపెద్ద కారు తయారీసంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలు మాత్రం తమ విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. తాము నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి టార్గెట్‌ను చేధిస్తామని ఈ రెండు కారు కంపెనీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మారుతీ సుజుకీ 1.58 మిలియన్ యూనిట్ల నుంచి 1.6 మిలియన్ యూనిట్ల అమ్మకాలు చేపడుతుందని తెలిసింది. అయితే కంపెనీ నిర్దేశించుకున్న ఇంటర్నల్ టార్గెట్ 1.565 మిలియన్లు మాత్రమే.
పెద్దనోట్లు రద్దైనప్పటికీ, తాము 1.5 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ వార్షిక లక్ష్యాన్ని చేధిస్తామని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ్ చెప్పారు. నవంబర్‌లో బుకింగ్స్ పడిపోయాయని, ప్రస్తుతం బుకింగ్స్ వెల్లువ కొనసాగుతుందని పేర్కొన్నారు. జనవరి కల్లా తమ వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామన్న క్లారిటీ తమకుందని వెల్లడించారు. అక్టోబర్ పండుగ సీజన్లో తిరిగి రిటైల్ అమ్మకాలు పుంజుకుని, నవంబర్ నెలలో కంపెనీ విక్రయాలు రికార్డు స్థాయిలో 14 శాతం దూసుకుపోయాయి. అదేనెలలో పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రద్దు ప్రభావం మిగతా ఆటో కంపెనీలపై భారీగానే చూపింది. అదేవిధంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ 2016 టార్గెట్ 6,65,000 యూనిట్ల ఉత్పత్తిని చేధిస్తామని చెప్పింది. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలంలోనే ఉంటుందని, ఫైనాన్స్‌ల ద్వారా మంచి అమ్మకాలు చేపడుతున్నామని హ్యుందాయ్ ఇండియా తెలిపింది.